ఐపీఎల్ 2024 సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికరమైన పోరుకు సిద్ధమైంది. సోమవారం వాంఖడే వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. ఇప్పటికే 11 మ్యాచ్‌ల్లో ఎనిమిది ఓడిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. టోర్నీలో మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచినా ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌కు చేరే అవకాశం లేదు. మరోవైపు 10 మ్యాచుల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్.. ముంబైని ఓడించి ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసుకు దూరమైన ముంబై ఇండియన్స్ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం ఉంది. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అతడు విశ్రాంతి తీసుకునే అవకాశాలున్నాయి. అతనితో పాటు జస్ప్రీత్ బుమ్రా కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.