Homeజిల్లా వార్తలువిద్యార్థుల ప్రాణాలతో  'శ్రీ చైతన్య' చెలగాటం..!

విద్యార్థుల ప్రాణాలతో  ‘శ్రీ చైతన్య’ చెలగాటం..!

  • మంజీర పైప్ లైన్ రోడ్డులో ఉన్న బ్రాంచిలో పిల్లర్లు ,గోడల నుండి నీటి లీకేజీ..
  • గుట్టు చప్పుడు కాకుండా సెల్లార్ నుండి మోటార్ తో నీటిని బయటకు పంపిస్తున్న వైనం..
  • ప్రమాదం పొంచి ఉన్నదని తెలిసినా అందులోనే క్లాసుల నిర్వహణ..
  • అలసత్వంలో మండల విద్యాశాఖ అధికారులు.

ఇదేనిజం,శేరిలింగంపల్లి: శ్రీ చైతన్య విద్యాసంస్థల ధనదాహానికి అంతేలేకుండా పోతున్నది. విద్యార్థులకు ఏమైనా పర్వాలేదు మా ఖజానా నిండితే చాలు అన్న చందంగా యాజమాన్యం వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు విద్యాసంస్థలు ఈ విద్యా సంవత్సరం ఎలాంటి అనుమతులు లేకుండానే హడావుడిగా ఎన్నో నూతన బ్రాంచీలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఒక్కోచోట  కనీసం బిల్డింగ్ అసంపూర్తిగానే ఉండగానే  అడ్మిషన్లు కానిచ్చి అందులోనే క్లాసులకు తెరలేపింది.ఒక్కోవిద్యార్థి నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేసింది. శేరిలింగంపల్లి మండల పరిధిలో హఫీజ్ పేట్ డివిజన్ మంజీర పైప్ లైన్ రోడ్డులో ఓ శాఖను ఏర్పాటు చేసింది. అయితే దానికి ఎలాంటి అనుమతులు లేవు. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న ఈ బ్రాంచిలో  సుమారు 200 పై చిలుకు విద్యార్థులు ఉన్నారు. అయితే సదరు బిల్డింగ్ పక్కనే మల్లయ్య కుంట ఉన్నది. దీంతో  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంట పూర్తిగా నిండింది. కుంటను ఆనుకొనే   స్కూల్ బిల్డింగ్ ఉండడంతో  పిల్లర్ల నుండి వాటర్ లీకవుతున్నది. దీంతో కొన్ని పిల్లర్లు  ధ్వంసం అయ్యి అందులోనుంచి నీరు బయటకు వస్తుంది. అంతేగాకుండా గోడల నుంచి కూడా నీరు లీకేజీ అవుతోంది.  నిత్యం సెల్లార్ పూర్తిగా ఫీట్ లోతులో నిండిపోతుంది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా నీరు బయటకు పంపించి ఎవరికంట పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రమాదం పొంచి ఉన్నది అని తెలిసినా అందులోనే క్లాసుల్ని నిర్వహించడం వారి  ధన దాహానికి అద్దం పడుతుంది. అయితే దురదృష్టవశాత్తూ జరగరానిది జరిగితే బాధ్యులెవరని కనీసం ప్రమాదం జరగక ముందే మండల విద్యాశాఖ ,జీహెచ్ఎంసి అధికారులు తేరుకొని దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అనుమతుల విషయంలో నిబంధనలకు నీళ్లు..
అనుమతుల విషయంలో అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలినట్లు ఈ బిల్డింగ్ నిర్మాణమే రుజువు చేస్తుంది.  కుంటను అనుకొని చేపట్టిన నిర్మాణంలో  ఎలాంటి సెల్లార్ త్రవ్వకాలకు అనుమతులు లేవు. అయితే బిల్డింగ్ నిర్మాణానికి ముందు పెద్దమొత్తంలో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది పెద్ద మొత్తంలో దండుకుని  జోనల్  అధికారులను మ్యానేజ్ చేశారని తెలుస్తోంది. దీంతో జోనల్ మరియ చందానగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతుల విషయంలో అత్యుత్సాహం  ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇందుకు వర్షాకాలంలో  సెల్లార్ తీస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరించడమే అందుకు నిదర్శనం. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని ప్రస్తుతం కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా పైగా దానికి యన్ఓసీ కూడా జారీ చేయడం గమనార్హం.

ఇదేనిజం దిన పత్రికలో  చైతన్య విద్యా సంస్థల ధన దాహం పేరుతో కథనం..
గతంలో ఇదేనిజం దిన పత్రికలో  చైతన్య విద్యా సంస్థల ధన దాహం పేరుతో వార్త కథనం రాసింది. ఇదేవిషయాన్ని అప్పటి ఎంఈఓ వెంకటయ్య దృష్టికి తీసుకురాగా  సదరు విద్యాసంస్థకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. అదేవిధంగా మేనేజ్మెంట్ తో  మాట్లాడి రెండు రోజుల్లో బ్రాంచిని ఎత్తివేయాలని నోటీసులు కూడా ఇచ్చారు.అయితే మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ కేవలం బయట ఉన్న బోర్డునైతే తొలగించారు కానీ క్లాసులు మాత్రం యదావిధిగా నడుస్తున్నాయి. ఈ విషయమై ప్రస్తుత ఏంఈఓ ను వివరణ కోరితే విద్యాసంవత్సరం మధ్యలో ప్రపోజల్స్ పంపించామని చెప్పడం శోచనీయం. మొదటినుంచీ విద్యాశాఖ అధికారులు  రాజకీయ ఒత్తిళ్లకు  తలొగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా  విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా   మండల విద్యా శాఖ అధికారులు దృష్టి సారించి అనుమతులు లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవడమే గాకుండా పొంచి ఉన్న ముప్పు నుంచి కాపాడాలని కోరుతున్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన జోనల్ కమీషనర్, మండల విద్యాధికారి అయినా దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img