Homeహైదరాబాద్latest Newsఉత్సవాలకు ముస్తాబైన శ్రీ జోగినాథ ఆలయం

ఉత్సవాలకు ముస్తాబైన శ్రీ జోగినాథ ఆలయం

-రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరణ
తెలంగాణ జిల్లాలోనే అతిపెద్ద లోహరథం
ఈనెల 13 నుంచి ఉత్సవాలు ప్రారంభం
హాజరుకానున్న ప్రముఖులు

ఇదే నిజం, జోగిపేట : సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మరో రెండు రోజుల్లో శ్రీ జోగినాథ రథోత్సవాలు జరగనున్నాయి. 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఉత్సవాలకు భక్తులు పెద్దఎత్తున తరలిరానుండటంతో అలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. ఈ ఉత్సవాలు ఈనెల 13వ తేది నుంచి 23వ తేది వరకు జరగనున్నాయి.

ఉత్సవాల ప్రత్యేకత
దాదాపు 50 ఏళ్లుగా శ్రీ జోగినాథ రథోత్సవాలను నిర్వహిస్తున్నారు. మొదట్లో కట్టెలతో తయారు చేసిన రథాన్ని ప్రధాన వీధుల గుండా ఊరేగించేవారు. సుమారుగా 20 సంవత్సరాల నుంచి 55 ఫీట్ల ఎత్తైన లోహరథాన్ని తయారు చేయించి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తుల సహకారంతో తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద లోహరథం రూపుదిద్దుకుంది. పది రోజుల పాటు జరిగే ఉత్సవాలలో రథం ఊరేగింపు ప్రత్యేకమైందని చెప్పవచ్చు. అయిదు అంతస్తులతో కూడిన రథంపై ప్రతి అంతస్తులో దేవతా మూర్తులైన నందీశ్వరుడు, గణపతి, దుర్గామాత, శివలింగం, ఇద్దరు దివ్య సుందరీమణుల పంచలోహ విగ్రహాలను ఏర్పాటు చేశారు.

జాతరకు భారీ ఏర్పాట్లు
జాతరకు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ జాతర ఉత్సవాలను నిర్వహించేందుకు 21 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పట్టణంలోని అన్ని వర్గాల వారిని జాతర వేడుకల్లో భాగస్వాములు చేస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఉత్సవాలకు హాజరుకానున్న ప్రముఖులు
జోగినాథ ఉత్సవాల్లో భాగంగా రథం ఉరేగింపు కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఎంపీ బీబీ పాటిల్, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు హజరు కానున్నారు.

జాతర ఉత్సవాల్లో భాగంగా ముఖ్య తేదీలు..

13న గణపతి పూజ, పుణ్య వచనం, గరుడ గంగా స్నానం.
15వ తేదీన రథ శిఖర స్థాపన.
18న రాత్రి 9:30 గంటలకు జోగినాథ స్వామి రథోత్సవం.
19న ఎడ్లబండ్ల ఊరేగింపు.
20న ఉదయం 5 గంటల నుంచి అగ్నిగుండ ప్రవేశం.
21న ఉదయం 11:24 గంటలకు శివ పార్వతుల కల్యాణం.
22న సాయంత్రం 7 గంటలకు నక్షత్ర డ్యాన్స్‌ ఆకాడమీ ఆధ్వర్యంలో చిన్నారుల నాట్య ప్రదర్శన, రాత్రి 12 గంటలకు లంకాదహనం.
23న అమ్మవారికి కుంకుమార్చన, మహారుద్రాభిషేకం, నాట్య ప్రదర్శనలతో జాతర ఉత్సవాలు ముగియనున్నాయి.

Recent

- Advertisment -spot_img