Homeఫ్లాష్ ఫ్లాష్శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు ఎస్ఎస్ బద్రీనాథ్ కన్నుమూత

శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు ఎస్ఎస్ బద్రీనాథ్ కన్నుమూత

– దేశంలోనే అత్యుత్తమ కంటి వైద్యులుగా గుర్తింపు తెచ్చుకున్న బద్రీనాథ్
– 1996లో కేంద్రం నుంచి పద్మభూషణ్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు, ప్రముఖ విట్రియోరెటినల్‌ సర్జన్‌ ఎస్‌ఎస్‌ బద్రీనాథ్‌(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బద్రీనాథ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించిన విషయాన్ని తమిళనాడు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రామ సుగంథన్‌ ధృవీకరించారు. కాగా వైద్య రంగంలో ఆయన చేసిన కృషికిగానూ 1996లో భారత ప్రభుత్వం బద్రీనాథ్‌ను పద్మభూషణ్​ అవార్డుతో సత్కరించింది. దేశంలోనే అత్యుతమ కంటి వైద్యులుగా ఎస్‌ఎస్‌ బద్రీనాథ్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద నేత్ర వైద్యశాలల్లో ఒకటైన శంకర్‌ నేత్రాలయను ఆయన స్థాపించారు. చెన్నైలో 1940 ఫిబ్రవరి 24న జన్మించిన సెంగమేడు శ్రీనివాస బద్రీనాథ్.. యుక్తవయస్సులో ఉన్నప్పుడే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు. తల్లిదండ్రుల మృతి అనంతరం వచ్చిన భీమా డబ్బుతో వైద్య శాస్త్రంలో తన చదువు పూర్తి చేశారు.

అనంతరం న్యూయార్క్‌లో డాక్టర్‌ వృత్తిని ప్రారంభించి.. అనేక నేత్ర వైద్య కేంద్రాలలో శిక్షణ పొందాడు. విదేశాలలో విద్యనభ్యసించిన బద్రీనాథ్‌ అనేక అధ్యయనాలు పరిశోధనలను పూర్తి చేశారు. తిరిగి భారత్​కు వచ్చిన బద్రీనాథ్​ 1978లో వైద్యుల బృందం సాయంతో చెన్నైలోని శంకర నేత్రాలయ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉచిత వైద్య చికిత్సను అందించడానికి కృషి చేశారు. ఆయన స్థాపించిన శంకర నేత్రాలయ సంస్థ ప్రతిరోజూ వందల మంది పేదలకు ఉచిత వైద్య చికిత్స కేంద్రంగా మారింది. చాలాకాలంపాటు దీనికి ఆయన చైర్మన్‌గా వ్యవహరించారు. బద్రీనాథ్‌ మృతిపై శంకర నేత్రాలయ సంస్థ స్పందిస్తూ.. ‘మా లెజెండ్‌, శంకర నేత్రాలయ స్థాపకుడు డాక్టర్‌ ఎస్‌ఎస్‌ బద్రీనాథ్‌ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. నేడు ఆయన అంత్యక్రియలు బీసెంట్‌ నగర్‌ శ్మశాన వాటికలో జరగనున్నాయి. మా నాయకుడి మరణంపై శంకర్‌ నేత్రాలయ సంస్థ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, బద్రీనాథ్​ సతీమణి వాసంతి పీడియాట్రిషియన్‌, హెమటాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img