Stocks:దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు వరుస సెషన్ల నష్టాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒకశాతానికి పైగా లబ్ధితో ముగిశాయి. సెన్సెక్స్ 60 వేల మార్క్, నిఫ్టీ 18 వేల మార్క్‌ను దాటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల నుంచి అన్ని సెక్టార్ల స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. తొలుత టీసీఎస్ ఆర్థిక ఫలితాలు వెలువడనున్నాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3 లక్షలకు పైగా పెరిగింది. అంతర్జాతీయ సానుకూల పరిణామాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ రెండు నెలల్లో గరిష్టంగా లబ్ధి పొందింది.
పుంజుకున్న సూచీలు
ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 989 పాయింట్లకు పైగా పుంజుకుని గరిష్ఠంగా 60,889.41 పాయింట్లకు దూసుకెళ్లింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 1.41 శాతం (846.94 పాయింట్లు) లబ్ధితో సెన్సెక్స్ స్థిర పడింది. నిఫ్టీ 282 సుమారు పాయింట్ల లబ్ధితో ఇంట్రాడే ట్రేడింగ్‌లో 18,141.40 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ 241.75 పాయింట్లు (1.35 శాతం) లబ్ధితో ముగిసింది.
ఇక సోమవారం టీసీఎస్ ఆర్థిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఐటీ స్టాక్స్ భారీగా లబ్ధి పొందాయి. బీఎస్ఐఈ టీ ఇండెక్స్ 711 పాయింట్లకు పైగా దూసుకెళ్తే, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ సుమారు మూడు శాతం లాభ పడింది. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ ఆర్థిక ఫలితాలు ఈ నెల 12న, విప్రో ఆర్థిక ఫలితాలు 13న వెలువడనున్నాయి.
బీఎస్ఈలో ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఇంధనం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు 1-1.5 శాతం మధ్య లాభ పడ్డాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ సుమారు 394 పాయింట్ల లబ్ధి పొందింది. మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్ 2.6-3.6 శాతం మధ్య భారీగా లాభ పడ్డాయి. విప్రో, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, టాటా స్టీల్, ఎల్ &టీ స్టాక్స్ కూడా 1.5-2.5 శాతం మధ్య పుంజుకున్నాయి.
మరోవైపు ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ రెండు నెలల గరిష్టానికి చేరుకున్నది. ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలర్‌పై రూపాయి విలువ రూ.82.36 గా రికార్డయింది. గతేడాది నవంబర్ 11 తర్వాత రూపాయి అత్యధికంగా పుంజుకోవడం ఇదే తొలిసారి. గత శుక్రవారం రూపాయి విలువ 82.72గా నిలిచింది.