నేతాజీ సుభాష్ చంద్రబోస్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు.
బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు.
బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ, జపానుతో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.
అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగష్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు. దీని వల్ల ఆయన బతికి ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్ కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని. దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది.
1956 మే నెలలో నలుగురు సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్కు వెళ్ళింది. అప్పట్లో భారత్ కు తైవాన్ తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కొరవడింది. దాంతో ఇది ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1999-2005 లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమీషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్థారణకు వచ్చింది.
అంతే కాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమీషన్ కు లేఖను పంపడం జరిగింది. ఈ కమీషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమీషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదనీ, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమీషన్ నివేదికను తిరస్కరించింది.