– టీజేఎస్ అధినేత కోదండరామ్‌ను కోరిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
– ప్రభుత్వం ఏర్పడ్డాక సముచిత స్థానం కల్పిస్తామని హామీ
– భేటీ అనంతరం పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన కోదండరామ్
ఇదే నిజం, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పోటీకి తెలంగాణ జనసమితి (టీజేఎస్) దూరంగా ఉండనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, కర్ణాటక మంత్రి బోసు రాజు తదితరులు కోదండరామ్‌ను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ సర్కారు అవినీతిపై ప్రొఫెసర్ కోదండరామ్ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన మద్దతు కోరామన్నారు. కేసీఆర్ నుంచి తెలంగాణ విముక్తికి కలిసి పనిచేయాలని ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్-టీజేఎస్ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీజేఎస్‌ను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామని హామీ ఇచ్చారు.తమ ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్‌కు సహకరించకుండా తమ బంధువులు, మిత్రులను మంత్రి కేటీఆర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. కోదండరామ్.. మాట్లాడుతూ కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపామన్నారు. నవతెలంగాణ నిర్మాణ ప్రాతిపదికన మద్దతు తెలిపామని చెప్పారు. ఇరుపార్టీలతో సమన్వయ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీజేఎస్ తరఫున ఆరు అంశాలను కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టామని చెప్పారు. నాణ్యమైన విద్య, వైద్యం, రైతుల భూముల రక్షణ, ప్రజాస్వామ్య పాలన, ఉద్యమకారుల సంక్షేమ కోసం బోర్డు ఏర్పాటు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉండాలని కోరామన్నారు.