Suresh Raina : టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టులో ‘చిన్న తల’గా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించిన సురేష్ రైనా సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన తమిళ చిత్ర పరిశ్రమలో ‘డ్రీమ్ నైట్ స్టోరీస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్‌పై రూపొందనున్న ఓ సినెమాటోహ్ నటుడిగా తెరంగేట్రం చేయనున్నారు. ఈ చిత్రాన్ని శరవణ కుమార్ నిర్మిస్తుండగా, లోగన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో రూపొందనున్నట్లు సమాచారం. సురేష్ రైనా ఈ చిత్రంలో హీరోగా నటిస్తారా లేక కీలకమైన మరో పాత్రలో కనిపిస్తారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. గతంలో హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి క్రికెటర్లు తమిళ చిత్రాల్లో నటించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు సురేష్ రైనా కూడా ఈ జాబితాలో చేరారు. రైనా క్రికెట్ కెరీర్‌లో దూకుడైన బ్యాటింగ్, అద్భుతమైన ఫీల్డింగ్‌తో అభిమానులను అలరించారు. ఇప్పుడు సినిమా రంగంలోనూ అదే ఉత్సాహంతో విజయం సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.