- సంక్షేమం కోసం 2 లక్షల 70 వేల కోట్లు ఖర్చు చేసినా నో యూజ్
- పవన్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే సీన్ మరోలా ఉండేది
- ఢిల్లీ చిట్ చాట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఏపీలో జగన్ ఓడిపోవడం చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన సంక్షేమం కోసం 2 లక్షల 70 వేల కోట్లు ఖర్చు చేసి జనం ఆదరించకపోవడం చూసి షాక్ కు గురయ్యానన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ పవన్ కల్యాణ్ పోటీ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఏపీలో వైఎస్ జగన్ గెలుస్తున్నాడంటూ తమకు రిపోర్టులు వచ్చాయని.. కానీ తుది ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. మధ్యలో ఏం జరిగిందనేది అంతుపట్టట్లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రోజూ జనంలో ఉండే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడిపోవడం ఏమిటని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు కలిసి కూటమిగా వచ్చినా కూడా జగన్‌కు 40 శాతం మేర ఓట్లు పోలవటమనేది సామాన్యమైన విషయం కాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఏం కావాలో, వాళ్ల పల్స్ పట్టుకోవడం ఎలాగో ఈ ఫలితాలు చూసిన తరువాత రాజకీయ నాయకులకు ఏమాత్రం అర్థం కావట్లేదని ఇంట్రెసింగ్ కామెంట్లు చేశారు. ఏపీలో షర్మిలను కూటమి ఓ పావులా వాడుకున్నదని అభిప్రాయపడ్డారు.