surya vamsi vaibhav : ఇంగ్లాండ్‌లో జరుగుతున్న అండర్-19 యూత్ వన్డే సిరీస్‌లో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. జూలై 5న వొర్సెస్టర్‌లో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన నాలుగో వన్డేలో కేవలం 52 బంతుల్లో సెంచరీ సాధించి, మెన్స్ యూత్ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును తన పేరిట నమోదు చేశాడు.
వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి దూకుడుగా ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో క్రీజులో విజృంభించాడు. 19వ ఓవర్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్ రాల్ఫీ ఆల్బర్ట్ బౌలింగ్‌లో సింగిల్‌తో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్లతో 143 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను పాకిస్తాన్ ఆటగాడు కమ్రాన్ గులాం (53 బంతుల్లో సెంచరీ) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ నజ్ముల్ శాంటో (2009లో 14 సంవత్సరాల 241 రోజుల వయసులో సెంచరీ సాధించాడు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.