బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐ విచారించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం రియా చక్రవర్తి పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు కేసును సిబిఐకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. సుశాంత్ సింగ్ మృతి కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ సిబిఐకి అప్పగించాలని మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది. సుశాంత్ ఈ కేసును సిబిఐ చేపట్టాలని బీహార్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఇదివరకే కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
కేసు పూర్వాపరాలు
సుశాంత్ మృతి కేసులో పాట్నాలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను ముంబైకి బదిలీ చేయాలని రియా సుప్రీంలో పిటిషన్ వేసింది. దీనిపై ఆగస్టు 11వ తేదీన విచారణ జరిగింది. జస్టిస్ హృషికేశ్ రాయ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా తరపున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్, మహారాష్ట్ర తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి వాదిస్తున్నారు. బీహార్ రాష్ట్రం తరపున మనిందర్ సింగ్ వాదిస్తున్నారు. సుశాంత్ తండ్రి రాజ్‌పుత్ తరపున సీనియర్ కౌన్సిల్ వికాశ్ సింగ్ వాదిస్తున్నారు. జూన్ 14వ తేదీన బాంద్రాలోని తన ఇంట్లో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు నిర్ధారించారు. కానీ తన కుమారుడి మరణానికి రియానే కారణమంటూ సుశాంత్ తండ్రి ఆరోపిస్తున్నారు.