Tamil Nadu Budget: కేంద్రం ప్రభుత్వం బీజేపీ పార్టీ తమిళనాడుపై హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని అధికార డిఎంకె పార్టీ ఆరోపించింది. ఈ క్రమంలో సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీస్కున్నారు. జాతీయ విద్యా విధానం (NEP)కి వ్యతిరేకంగా, ఎంకే స్టాలిన్ ప్రభుత్వం 2025-26 రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుండి రూపాయి (₹) చిహ్నాన్ని తొలగించింది. దాని స్థానంలో ప్రభుత్వం తమిళ భాష చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. ఒక రాష్ట్రం జాతీయ కరెన్సీ చిహ్నాన్ని తిరస్కరించడం ఇదే మొదటిసారి.
జాతీయ విద్యా విధానం (NEP), 2020 లో ప్రతిపాదించబడిన త్రిభాషా సూత్రం కేంద్ర ప్రభుత్వం మరియు ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం మధ్య రాజకీయ వివాదానికి కేంద్రంగా ఉంది. తమిళనాడు ప్రభుత్వం NEP మరియు త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి నిరాకరించింది. దీని కారణంగా, కేంద్ర ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ (SSA) కింద అందించే రూ.573 కోట్ల కేంద్ర సహాయాన్ని నిలిపివేసింది. SSA నిధులు పొందడానికి రాష్ట్రాలు NEP మార్గదర్శకాలను పాటించాలి. నిధులు నిలిచిపోవడంపై సీఎం స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని రుద్దుతున్నారని ఆయన ఆరోపించారు.