ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: గులాబీ బాస్ కేసీఆర్ను ఉక్కిరి బిక్కిరి చేయాలి. ఆయనను జనంలోకి రానివ్వొద్దు. ప్రజల్లో పలుచన చేయాలి.. ఇదే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్, 24 గంటల విద్యుత్ ఈ రెండు అంశాలను కాంగ్రెస్ సర్కారు టార్గెట్ చేసింది. కాళేశ్వరం పేరిట భారీ అవినీతి జరిగిందని నిరూపించే యత్నం చేస్తోంది. ఇక మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడాన్ని చూపించి మొత్తం ప్రాజెక్ట్ నాశనం అయ్యిందని చెప్పేందుకు యత్నిస్తోంది. ఇక దీంతోపాటూ విద్యుత్ కొనుగోళ్లల్లో అనేక అక్రమాలు జరిగాయని చెప్పేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో లీకులు ఇస్తూ కేసీఆర్ ను టార్గెట్ చేస్తోంది. నిజానికి కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రెండింటిని తమ విజయం కింద చెప్పుకున్నారు. అందుకే కాంగ్రెస్ వీటిని టార్గెట్ చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించామని.. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇచ్చామని ఆయన ప్రచారం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ వీటినే టార్గెట్ చేసింది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని.. గత పదేండ్లలో 100 ఏండ్ల విధ్వంసం జరిగిందని పదే పదే రేవంత్ ఆరోపించడం గమనార్హం.
ఎందుకిలా..
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చావు తప్పి కన్ను లొట్టపోయిందన్నట్టుగా కేవలం 8 సీట్లు గెలుచుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్లమెంటుకు వచ్చేసరికి 8 స్థానాలకే పరిమితమైంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లు మాత్రమే తెచ్చుకున్న బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లోనూ 8 స్థానాలు గెలుచుకోవడం గమనార్హం. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, బీఆర్ఎస్ అనుకూల ఓటు మొత్తం బీజేపీ ఖాతాలోకి చేరిపోయిందన్న చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా రేవంత్ సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం.. కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో ఆ పార్టీ వైభవం తగ్గింది. ముఖ్యంగా కాంగ్రెస్పార్టీలో రేవంత్ రెడ్డి పలుకుబడి మరింత దిగువకు పడిపోయింది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ శత్రువే. కానీ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో.. ఆ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం.. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థి. సంస్థాగతంగా ఏ మాత్రం బలం లేకపోయినా.. మోడీ వేవ్.. కలిసొచ్చిన బీఆర్ఎస్ ఓట్లతో బీజేపీ ఈ స్థాయిలో స్థానాలు దక్కించుకున్నది. కానీ స్థానిక సంస్థలకు వచ్చే సరికి ఆ పార్టీ అసలు పోటీలోనే ఉండే అవకాశం లేదు. అప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది. అందుకే కేసీఆర్ ను ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి చేసి ఎన్నికలకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచితే తాము గట్టెక్కొచ్చని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటున్నది. అందుకే కేసీఆర్ను టార్గెట్ చేస్తోంది.
గ్యారెంటీల అమలు మాటేంటి?
కాంగ్రెస్ పార్టీ అసలు ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందా? అది సాధ్యమేనా? అన్న డౌట్స్ అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీలోని లీడర్లకు కూడా ఆ విషయం తెలుసు. అందుకే ఈ అంశం మీద చర్చ జరగకుండా నిత్యం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా వీక్ చేస్తే .. అప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు ఫైట్ నడుస్తోంది. అదే జరిగితే బీజేపీకి రాష్ట్ర స్థాయిలో బలమైన లీడర్ ఎవరూ లేరు కాబట్టి.. తాము సునాయాసంగా గెలవచ్చన్నది కాంగ్రెస్ ప్లాన్. అందుకే బీఆర్ఎస్ పార్టీని క్రమంగా టార్గెట్ చేస్తోంది. ఇక మోడీ చరీష్మాతో పార్లమెంటులో బీజేపీ గట్టెక్కగలదు కానీ.. అసెంబ్లీ ఎన్నికల నాటికి మోడీ ప్రభావం పనిచేయకపోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో తాము బలపడాలంటే బీఆర్ఎస్ బలహీన పడాలని కాషాయనేతలు కూడా భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ను టార్గెట్ చేస్తామంటూ బీజేపీ సహకరించే అవకాశమూ ఉంది.
అసంతృప్తి పెరిగిపోయే చాన్స్
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేయడం కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటికే రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో కేసీఆర్ బయటకు రాకపోతే అసలు రైతు బంధు పడేది కాదన్న ఆలోచన కూడా రైతాంగంలో ఉంది. ఇక కాంగ్రెస్ ఇస్తామన్నది రైతు భరోసా ఎకరాకు రూ. 15వేలు ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పాత పద్ధతిలోనే ఇంకా పదివేలే ఇస్తోంది. పైగా రైతుకూలీలు, కౌలు రైతుల మాటే లేదు. ఈ వ్యతిరేకత ఇలా గూడుకట్టుకుంటే అది బీఆర్ఎస్ పార్టీకి లాభిస్తుందేమోనని రేవంత్ లెక్కలు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా వీక్ చేసి.. ఆ పార్టీలో నుంచి సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చేసుకుంటే.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు పరిస్థితి ఉంటే తమకు చాలా ఈజీ అని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. మరి ఇటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొని బీఆర్ఎస్ నిలబడుతుందా? అన్నది వేచి చూడాలి.
రుణమాఫీపై కొత్త సన్నాయి నొక్కులు
గత అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాము అధికారంలో వస్తే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమీ పెట్టలేదు. ఇప్పటికిప్పుడు రుణాలు తెచ్చుకోండి.. డిసెంబర్ 9న తాను రాగానే మాఫీ చేస్తానని చెప్పారు. కానీ ఆ పని చేయలేదు. పార్లమెంటు ఎన్నికల వరకు కాలయాపన చేశారు. ఎంపీ ఎన్నికలు రావడంతో కోడ్ అడ్డంగా ఉందన్నారు. ఇక రేవంత్ అయితే తాను రుణమాఫీ చేసి తీరుతానని కనిపించిన దేవుడిమీదల్లా ఒట్లు వేస్తూ పోయారు. ప్రస్తుతం కోడ్ పూర్తయ్యింది. అందుకే రేవంత్ రుణమాఫీ మీద ఫోకస్ పెట్టారు. మరి ఎంతమందికి ఏయే ప్రతిపాదికన చేస్తారన్నది వేచి చూడాలి. అయితే రుణమాఫి విషయంలో ప్రభుత్వం రకరకాల కొర్రీలు పెట్టాలని చూస్తోంది. పీఎం కిసాన్ యోజన కింద ప్రస్తుతం పేద రైతులకు మాత్రమే వర్తిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించడం లేదు. ట్యాక్స్ పేయర్లకు వర్తించడం లేదు. మరి ఈ రుణమాఫీ మార్గదర్శకాలను ప్రజలు ఎలా తీసుకుంటారో వేచి చూడాలి.