విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం చేస్తున్నాననే వార్త యావత్ తెలుగు ప్రజలను షాక్‌కు గురి చేసిందని విశాఖపట్నం ఉత్తర టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
ఈ మేరకు శుక్రవారం గంటా మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా అడ్డుకునేందుకు అవసరమైతే ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
రాజకీయాలు, పార్టీలకు అతీతంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గంటా స్పష్టం చేశారు.
ఎందరో ప్రాణ త్యాగాలతో ఆనాడు ఉక్కు కర్మాగారం సాధించామని, స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేవనే కుంటి సాకు చూపి ప్లాంట్‌ని 100 శాతం ప్రైవేటుపరం చేయడం దారుణమన్నారు.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచన సరైంది కాదని తేల్చి చెప్పారు. అనేక ప్రైవేటు సంస్థలకు రాష్ట్రంలో ఉన్న ఐరన్‌వోరు గనులు ఇస్తున్నారని.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఈ మేరకు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్లాంట్‌కు గనులు కేటాయించి నష్టాలు తగ్గించుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఇక, విశాఖను రాజధాని చేస్తామని చెబుతున్న జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడటం లేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కేసులకు భయపడి కేంద్రం చెప్పినట్లుగా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అంగుళం ప్రైవేటీకరణ చేసినా సహించేది లేదని హెచ్చరించారు.
ఇక, స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణపై విశాఖలో నిరసనలు హోరెత్తాయి. జీవీఎంసీ ఎదుట శుక్రవారం కార్మికులు నిరసన తెలిపారు.
భారీ సంఖ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ నుంచి గాజువాక ఎన్‌ఏడీ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బైక్ ర్యాలీ సాగింది.
నిరసనల్లో ఆల్ ట్రేడ్ యూనియన్లు పాల్గొన్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి మద్దతు పలికారు.
విశాఖ ఉక్కును సాధించుకుంటామని స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ర్యాలీలో గాజువాక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
ఇక, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమన్నా.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను లోక్‌సభలో అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఎంవీవీ అన్నారు.