గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్యపై తెలుగు దేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
20 నెలల రాజారెడ్డి రాజ్యాంగంలో ఒక్క ఆడపిల్లను కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని అనిత వ్యాఖ్యానించారు.
నరసరావుపేటకు చెందిన అనుషను హత్య చేసిన ఉన్మాది విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత కీ ఇస్తే ఆడే ఒక బొమ్మ మాత్రమేనని అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హోం మంత్రికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీ ఇస్తేనే ఆడుతుందని విమర్శించారు.
అనూషను దారుణంగా హత్య చేసిన నిందితుడి పేరు పక్కన రెడ్డి అని ఉంటే.. చర్యలు తీసుకోవడానికి పోలీసులు భయపడుతున్నారని అనిత ఎద్దేవా చేశారు.
పేరు చివర ‘రెడ్డి’ అని తోక ఉంటే రాష్ట్రంలో ఏ అరాచకమైనా చేయవచ్చా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ‘సాక్షి’ పేపర్లో కూడా నిందితుడి పేరుకి రెడ్డి తీసేసి వార్త రాశారని అనిత వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ‘దిశ’ చట్టం ఒక దిక్కుమాలినదని, కనీసం చట్టాన్ని కూడా కరెర్ట్‌గా తయారు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం జగన్ సర్కారు అని అనిత దుయ్యబట్టారు.
జగన్ ప్రభుత్వంలో మహిళల మానాలు, ప్రాణాలు రెండూ పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కన్నా ముందే జగన్ వస్తాడని ఊదరగొట్టారని, నరసరావుపేట అనూష కేసుపై జగన్ ఎందుకు స్పందించలేదని అనిత ప్రశ్నించారు.
అనూష కేసులో 21 రోజుల్లో నిందితుడుకి శిక్ష పడితే సీఎం జగన్‌కు సలాం చేస్తామని సంచలన ప్రకటన చేశారు.
ఒక విద్యార్థిని దారుణ హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు కనీసం స్పందించడా అని వంగలపూడి అనిత నిలదీశారు.
అంతకు ముందు కూడా విష్ణువర్ధన్ రెడ్డి కులాన్ని ఉద్దేశించి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ‘‘ఈ రాక్షసుడు విష్ణువర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ ఎలా అయ్యాడు? ఇక్కడ కూడా కులాన్ని కాపాడాలి అని ప్రయత్నం ఏంటో? కులం చూడం మతం చూడం అనే సూక్తి ముక్తావళి ఇలాంటప్పుడేనా ఆ గన్నేరుపప్పు చెప్పేది?’’ అంటూ సీఎం జగన్‌ను టార్గెట్ చేశారు.
ఇప్పటికే ఈ హత్య కేసులో రాష్ట్రంలో సంచలనం రేపిన నేపథ్యంలో, తాజాగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఇందులోకి కులాన్ని తీసుకురావడం తీవ్ర వివాదాస్పదమవుతోంది.