తెలంగాణలోని అన్ని తండాల్లో బీటీ రోడ్లు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తండాలు, గూడేలలో మౌలిక వసతులు కల్పించినప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందినట్లు మా ప్రభుత్వం పరిగణిస్తుంది. గత ప్రభుత్వం చాలా తండాలకు తాగునీరు సరఫరా చేయలేదు. అందుకే తండాలు, గూడేలలో రోడ్లు, తాగునీరు, కరెంట్, వైద్యం, విద్య సౌకర్యాలు అందిస్తాం’’ అని చెప్పారు.
గత ఎన్నికల్లో ప్రజలు శిక్షించినా ప్రతిపక్షాలు తమ తీరును మార్చుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘గత ప్రభుత్వం తండాలు, గూడేల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. అవసరమైతే ప్రతిపక్షాలను ఆయా తండాలకు తీసుకువెళ్లి వాస్తవ పరిస్థితులను చూపిస్తాం. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా.. అన్ని తండాలు, గూడేలను మేము అభివృద్ధి చేస్తాం’’ అని చెప్పారు.