Telangana Bonal festival : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ఆషాఢ మాసంలో ఘనంగా జరుపుకోబడుతుంది. ఈ పండుగ హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. 2025 సంవత్సరంలో ఈ ఉత్సవాలు జూన్ 26 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించడంతో మరింత అద్భుతంగా జరగనున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలంగాణలో బోనాల చరిత్ర : బోనాల పండుగ వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ పండుగ 19వ శతాబ్దంలో..అనగా 1813 ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో ప్రారంభమైనట్లు నమ్ముతారు. కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం.. ఈ సంప్రదాయం పల్లవ రాజుల కాలంలోనే గ్రామ దేవతలకు బోనాలు సమర్పించే ఆచారంగా మొదలైంది. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ‘ఏడు కోల్ల ఎల్లమ్మ’ నవదత్తి ఆలయాన్ని నిర్మించి, బోనాలు సమర్పించారని చెబుతారు. అలాగే, 1676లో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో సర్వాయి పాపన్న ‘ఎల్లమ్మ గుడి’ని నిర్మించి, దేవతకు బోనాలు సమర్పించినట్లు చరిత్ర పుస్తకాలు పేర్కొంటున్నాయి.
బోనం అనే పదం ‘భోజనం’ నుండి వచ్చింది, ఇది గ్రామ దేవతలైన మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ వంటి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించే ఆహారం. ఈ పండుగ వర్షాకాలంలో వచ్చే మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు, అంటువ్యాధుల నివారణకు సంబంధించినదని పెద్దలు చెబుతారు. వేప ఆకులు, పసుపు నీళ్లు చల్లడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచే ఆచారాలు ఈ ఉత్సవంలో భాగంగా ఉన్నాయి.
తొలి బోనం : తెలంగాణలో ఆషాఢ బోనాలు సాధారణంగా జూన్ లేదా జూలైలో మొదలవుతాయి. 2025లో ఈ ఉత్సవాలు జూన్ 26, గురువారం నుంచి గోల్కొండలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో తొలి బోనంతో ప్రారంభమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ మొదటి బోనం సమర్పించబడుతుంది. ఆషాఢ మాసంలో, భక్తులు అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో వండిన బోనాన్ని మట్టి లేదా రాగి కుండలలో అలంకరించి, వేప ఆకులు, పసుపు, కుంకుమలతో శృంగారించి, దీపం వెలిగించి, ఊరేగింపుగా అమ్మవారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా శివసత్తులు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో గ్రామాలు, నగరాలు కోలాహలంగా మారతాయి.