ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: మరో రెండు గ్యారెంటీలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 500కే సిలిండర్ ఇచ్చేందుకు.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఒకే చెప్పేసింది. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఆదివారం సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు పలు పథకాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సారి అసెంబ్లీలో ప్రభుత్వం ఓట్ ఆన్ బడ్జెట్‌ను తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నది. వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌లో టీఎస్‌ను టీజీగా మార్చేందుకు, రాష్ట్ర అధికార గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే తెలంగాణ తల్లి విగ్రహంతోపాటు రాష్ట్ర చిహ్నంలో పలు మార్పులు చేయాలని సైతం నిర్ణయించారు.