– కాషాయపార్టీకి కొత్త ఊపిరి
– పడిపోయిందనుకున్న పార్టీలో జవసత్వాలు
– బీసీ సీఎం, వర్గీకరణ హామీ ఓట్లు రాలుస్తాయా?
– బీజేపీ లీడర్లలో చిగురిస్తున్న ఆశలు
– బీసీలకు సీట్ల విషయంలో మాట తప్పిన కాంగ్రెస్
– మాదిగ యువతలో కాషాయపార్టీపై సానుభూతి
– వచ్చే ఎన్నికల్లో ప్రభావమెంత?
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీజేపీ కళకళలాడుతోంది. బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ ఈ రెండు ఆ పార్టీకి ప్రాణవాయువుగా మారాయి. రాష్ట్రంలో బీజేపీ కొంత మేర బలహీన పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితి మారింది. దీంతో తెలంగాణలో ఎలాగైనా బలపడాలని భావించిన బీజేపీ ఈ రెండు అస్త్రాలను తెరమీదకు తీసుకొచ్చింది. తాజా పరిణామాలతో బీజేపీకి బీసీలు, ఎస్సీల్లోని మాదిగ సామాజికవర్గంలో సానుభూతి వ్యక్తమవుతోంది. బీసీల్లోని తటస్థ ఓటర్లు.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన యువత బీజేపీకి దగ్గరయ్యారు. మరి ఈ రెండు అంశాలు బీజేపీకి ఓట్లు తెచ్చి పెడతాయా? అన్నది వేచి చూడాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఓ జాతీయ పార్టీ బీసీ నినాదాన్ని, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరమీదకు తీసుకురావడం ఆయా వర్గాల్లో సంతృప్తి నింపింది.
కీలక సమయంలో బీజేపీ గేమ్ ప్లాన్!
భారతీయ జనతాపార్టీ కీలక సమయంలో బీజేపీ గేమ్ ప్లాన్ సిద్ధం చేసుకున్నది. బీసీ సీఎం నినాదం.. ఎస్సీ వర్గీకరణ ఈ రెండు అస్త్రాలు తమకు ఓట్లు రాలుస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలహీనపడ్డ విషయం తెలిసిందే. దీంతో ఎలాగైనా పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ అగ్రనేతలు వ్యూహాలు రచించారు. తెలంగాణ ఎన్నికల్లో తాము కూడా బలంగా పోటీలో ఉండాలని భావించిన బీజేపీ అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచించింది. అందులో భాగంగానే బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణ తెరమీదకు తీసుకొచ్చింది. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటూ ప్రధాని మోడీ ప్రకటించారు. ఒక జాతీయ పార్టీ నేరుగా తాము అధికారంలోకి వస్తే బీసీ సీఎంను చేస్తామంటూ ప్రకటించడం బీసీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సముచిత స్థానం దక్కలేదు. పొన్నాల లక్ష్మయ్య లాంటి నేతలకు సైతం టికెట్ దక్కలేదు. ఒక పార్లమెంటు నియోజవకర్గ పరిధిలో రెండు టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఆ హామీని విస్మరించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మీద బీసీలు కోపంగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో బీజేపీ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నది.
విశ్వరూప సభ సక్సెస్తో జోష్
హైదరాబాద్ లో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ విశ్వరూప సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఎవ్వరూ ఊహించని విధంగా భారీగా జనం హాజరయ్యారు. ఇక ఈ సభలో మందకృష్ణను మోడీ .. ఆత్మీయంగా హత్తుకోవడం.. ఆయనను చిన్న తుమ్ముడిగా అభివర్ణించడం.. మంద కృష్ణ సైతం మోడీని పెద్దన్నగా అభివర్ణించడం మాదిగ సామాజికవర్గాన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మాదిగ యువతలో ఈ సభ కొత్త జోష్ నింపింది. ఇక ఏకంగా ప్రధాని మోడీ భారీ బహిరంగ సభలో వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలపడం.. వర్గీకరణ కోసం ఓ కమిటీ వేస్తామని ప్రకటించడం.. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటామని ప్రకటించడం మాదిగలకు ధైర్యం ఇచ్చింది. భారీ బహిరంగసభలో మోడీ ప్రకటించారు కాబట్టి.. భవిష్యత్ లో వర్గీకరణ చేస్తారని వారు నమ్ముతున్నారు. దాదాపు 30 ఏండ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత మాదిగల పోరాటానికి ఓ గట్టి మద్దతు దక్కింది. తమ చిరకాల ఆకాంక్ష నెరవేరే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ కల సాకారం కావాలంటే మాదిగలు ఈ సారి బీజేపీకి ఓటు వేయాల్సి ఉంది. ఇక మందకృష్ణ సైతం ఆ దిశగానే తన ప్రయత్నాలు చేస్తారు. మాదిగలను కూడగట్టి బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిస్తారు. దీంతో బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
మాదిగ ఓటర్ల ఎఫెక్ట్ ఎవరికి?
ఇక మాదిగ ఓటర్ల ఎఫెక్ట్ ఎవరిమీద పడబోతున్నదన్న చర్చ సాగుతోంది. సహజంగా దళిత సమాజం మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నదన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు బీజేపీ వర్గీకరణ అంశానికి సపోర్ట్ చేస్తోంది. వర్గీకరణను దళితుల్లోని మాల సామాజికవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. మాదిగలు, ఇతర కులకులాలు మాత్రం వర్గీకరణ కావాలంటున్నాయి. అయితే తెలంగాణలో మాలల కంటే మాదిగలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దీంతో మాదిగ వర్గం ఓట్లను తమవైపుకు తిప్పుకొనేలా ప్లాన్ చేసింది. అయితే గతంలో ఈ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేది కనక ప్రస్తుతం ఆ పార్టీకి కొంత మేర ఎఫెక్ట్ అయ్యే చాన్స్ఉంది. ఇక బీజేపీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక మాదిగలు బీఎస్పీకి సపోర్ట్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కొంతమేర బీఎస్పీకి కూడా నష్టం వాటిల్లే చాన్స్ ఉంది. మొత్తంగా బీసీ నినాదం, ఎస్సీ వర్గీకరణ అంశాలతో బీజేపీ రాష్ట్రంలో కొంతమేర బలపడినట్టు కనిపిస్తోంది.