- పటాన్ చెరు టికెట్ మార్పు
- నీలం మధు స్థానంలో కాట
- తుంగతుర్తి శామ్యూల్‌కు.. సూర్యాపేట దామోదర్ రెడ్డికి
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ తుది జాబితా వచ్చేసింది. అయితే గత లిస్ట్ కు సంబంధించి స్వల్ప మార్పు జరిగింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధుకు పటాన్ చెరు టికెట్ లభించిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ స్థానాన్ని మర్చారు. నీలం మధు స్థానంలో దామోదర రాజనర్సింహ అనుచరుడు కాటా శ్రీనివాస్ గౌడ్ కే అవకాశం కల్పించారు. కాటా కోసం కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ గట్టిగా పట్టుబట్టారు. ఒకానొక దశలో ఆయన పార్టీ మారబోతున్నారంటూ కూడా ప్రచారం సాగింది. అధిష్ఠానం రంగంలోకి దిగినా దామోదర వినలేదు. చివరకు తన అనుచరుడికి టికెట్ ఇప్పించుకున్నారు. ఇక తుంగతుర్తి విషయంలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఇక్కడ అద్దంకి దయాకర్ తోపాటూ అనేక మంది లీడర్లు టికెట్ కోసం పోటీ పడ్డారు.
చివరకు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మందుల శామ్యూల్ కు అవకాశం దక్కింది. తుంగతుర్తి స్థానంలో శ్యామూల్ కు టికెట్ ఇస్తే సీనియర్ నేతల నుంచి ఎటువంటి సమస్య ఉండదని భావించిన కాంగ్రెస్ ఆయన వైపు మొగ్గు చూపింది. అద్దంకి దయాకర్ కు టికెట్ ఇప్పించుకొనేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించగా.. సీనియర్లు మాత్రం అడ్డుకున్నారు. చివరకు ఏ పంచాయితీ ఉండకుండా శ్యామూల్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఇక సూర్యాపేట టికెట్ ను తన అనచరుడు పటేల్ రమేశ్ రెడ్డికి ఇప్పించుకొనేందుకు రేవంత్ రెడ్డి విశ్వప్రయత్నం చేసినట్టు తెలిసిందే. అయితే నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలను మాటలను గౌరవించి అధిష్ఠానం రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఇక చార్మినార్ టికెట్ ముజీబుల్లా షరీఫ్‌కు మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి కు దక్కింది. ఇక నేటితో కాంగ్రెస్ జాబితాల పర్వం ముగిసింది. ఇక ఈ టికెట్ల కోసం కూడా ఎంతో మంది పోటీ పడ్డారు. మరి వారంతా రేపు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో.. వేచి చూడాలి. నామినేషన్లు వేసేందుకు రేపటితో గడువు ముగియబోతున్నది. ఇక నామినేషన్లకు ఒక్కరోజు ముందు కాంగ్రెస్ పార్టీ తుది జాబితాను విడుదల చేయడం గమనార్హం.