– కాంగ్రెస్ నుంచి సూర్యాపేట టికెట్ దక్కకపోవడంతో కంటతడి
– పార్టీని నమ్ముకుంటే అన్యాయం చేసిందని ఆవేదన
– ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: నామినేషన్లకు చివరి రోజు వచ్చినా హస్తం పార్టీకి ఇంకా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అసంతృప్తులను బుజ్జగించడంలో ఆ పార్టీ విఫలమవుతోంది. దీంతో వారు ఇతర పార్టీల్లో చేరడం, ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం చేస్తున్నారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేశ్‌రెడ్డికి నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. అక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఖరారు చేసింది. టికెట్ దక్కని నేపథ్యంలో పటేల్ రమేశ్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు బోరుమని ఏడ్చారు. కాంగ్రెస్‌ను పార్టీని నమ్ముకుంటే అన్యాయం చేశారని బోరున విలపించారు. మరోవైపు పటేల్ రమేశ్‌రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నేడు సూర్యాపేటలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.