Homeతెలంగాణక‌రోనాతో రోజుకు 9 మందే చనిపోతున్న‌రా?

క‌రోనాతో రోజుకు 9 మందే చనిపోతున్న‌రా?

తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
కరోనా లెక్కలపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశం
ప్ర‌భుత్వ నివేదిక‌లో జిల్లాల వారీగా వివ‌రాలు లేవ‌ని వ్యాఖ్య‌
గస్టు 31 నుంచి సెప్టెంబర్ 4 వరకు జిల్లా బులెటిన్లు సమర్పించాలి
ప్రైవేట్‌లో సగం బెడ్స్ రిజర్వు చేస్తారా? లేదా?
సెప్టెంబర్ 22లోగా నివేదిక అందజేయాలని ఆదేశం
తదుపరి విచారణ సెప్టెంబర్ 24కు వాయిదా

హైదరాబాద్: తెలంగాణ‌లో రోజుకు 9 లేదా 10 మంది మాత్ర‌మే క‌రోనా కార‌ణంగా చ‌నిపోతున్నారా.. ఒక ప‌క్క క‌రోనా కేసులు పెరుగుతున్నప్ప‌టికీ మృతుల సంఖ్య త‌క్కువ‌గా ఉంద‌ని చెప్ప‌డం అనుమానాల‌కు తావిస్తోంద‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, చికిత్సపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. కరోనా కట్టడి చర్యలపై తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ నివేదిక నిర్లక్ష్యంగా, అస్పష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. కరోనా మృతులపై వాస్తవాలు వెల్లడించడం లేదనిపిస్తోందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కరోనా మృతులపై వాస్తవ వివరాలు వెల్లడించాలని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
పొంత‌న లేని లెక్క‌లు
జిల్లాల‌లో క‌రోనా లెక్కులు వివ‌రాల‌ను ప్ర‌భుత్వం, జిల్లా అధికారులు వేర్వేరుగా చెబుతున్నారని హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 4 వరకు జిల్లా బులెటిన్లు సమర్పించాలని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. జీహెచ్ఎంసీలో ఐసోలేషన్, కరోనా కేంద్రాల వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. జిల్లాల నుంచి కరోనా బాధితులు హైదరాబాద్ వచ్చేందుకు అంబులెన్సుల సంఖ్య‌ను పెంచాలని ఆదేశించింది.
అవి చ‌ట్టానికి అతీత‌మా?
నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని హైకోర్టు ప్ర‌శ్నించింది. ప్రైవేటు ఆస్పత్రులు చట్టానికి అతీతమా? అని ఒక సంద‌ర్భంలో తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ప్రైవేటు ఆస్పత్రులపై విచారణ జరిపి సెప్టెంబర్ 22లోగా నివేదిక అందజేయాలని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్స్ రిజర్వు చేస్తామన్నవైద్య‌ మంత్రి హామీ ఎందుకు అమలుకాలేదని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. 50 శాతం బెడ్స్ రిజర్వు చేస్తారా? లేదా? అనేది తెలపాలని.. ఒకవేళ రిజర్వు చేయొద్దని నిర్ణయిస్తే కారణాలు వెల్లడించాలంది.
బ‌డ్జెట్ వివ‌రాలు తెల‌పండి
కరోనాకు ముందు.. ఆ తర్వాత వైద్య ఆరోగ్యశాఖకు కేటాయించిన బడ్జెట్ వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసే ల్యాబ్‌ల సంఖ్య పెంచాలని స్పష్టం చేసింది. వీధుల్లో నివసించేవారికి మొబైల్ వ్యాన్ల ద్వారా కరోనా పరీక్షలు చేయాలని సూచించింది. రాష్ట్ర, జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ ప్రణాళికలను సెప్టెంబర్ 22 లోపు సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. తప్పుడు నివేదికలు సమర్పిస్తే చీఫ్ సెక్రటరీని కోర్టుకు పిలవాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img