Homeరాజకీయాలుతెలంగాణ దేశంలో నెంబర్​ వన్​

తెలంగాణ దేశంలో నెంబర్​ వన్​

– కేసీఆర్​ పాలనలో బంగారు తెలంగాణ
– ఒకప్పుడు పల్లెల నుంచి వలసల్లెవారు.. ఇప్పుడు పట్టణాల నుంచి..
– కేంద్రం ఇచ్చిన అవార్డులే ముఖ్యమంత్రి పాలనకు నిదర్శనం
– టీయూడబ్ల్యూజే ‘మీట్​ ది ప్రెస్’లో మంత్రి హరీశ్​రావు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్​ పాలనలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అయ్యిందని మంత్రి హరీశ్​రావు అన్నారు. బుధవారం టీయూడబ్ల్యూజే బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో జరిగిన ‘మీట్​ ది ప్రెస్’లో హరీశ్​రావు మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌ పాలనతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్​ స్థాయికి చేరిందన్నారు. సీఎం కేసీఆర్​ పట్టణాలతో సమానంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేశారన్నారు. గతంలో పల్లెల నుంచి ప్రజలు పట్టణాలకు వలస పోతే ఇప్పుడు పట్టణాల నుంచి పల్లెలకు వలస పోతున్నారని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే పల్లె, పట్టణ ప్రగతి అవార్డుల్లో కూడా తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ అవార్డులను దక్కించుకుందన్నారు. కేసీఆర్‌ విజన్‌ వల్లనే రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను అధిగమించగలిగామని, తాము ప్రకటించిన మ్యానిఫెస్టోలోని హామీలను 90 శాతం అమలుచేశామన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టని కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, రైతుబంధు, రైతుబీమా పథకాలు కూడా అమలు చేశామని పేర్కొన్నారు. మిషన్‌ కాకతీయతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు.

వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ రాష్ట్రాన్ని దాటేసి తెలంగాణ నెంబర్‌ 1గా మారిందన్నారు. సీఎం కేసీఆర్‌ చేతుల్లో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలతో ప్రజలకు వైద్యాన్ని చేరువ చేశామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశామని, నియోజకవర్గానికి ఒక 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశామన్నారు. బీఆర్​ఎస్​ పార్టీ పదేళ్ల పాలనలో కొత్తగా 6 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించామని, 90 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. దేశంలో వచ్చే ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి మన దగ్గరే ఉన్నదన్నారు. ప్రైవేట్​ రంగంలోనూ 24 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించామని మంత్రి హరీశ్​రావు అన్నారు.

Recent

- Advertisment -spot_img