ఇటీవలే ఏపీలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఆధ్వర్యంలో కొలువుదీరిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు ముందుగా ఇక ప్రక్షాళన కార్యక్రమాలు టీటీడీతో ప్రారంభించారు. ఇక అప్పటి వరకు ఈఓగా ఉన్న ధర్మారెడ్డిని తప్పించి అతని స్థానంలో కేంద్ర సర్వీసుల్లో ఉన్న శ్యామారావును కొత్త ఈఓగా నియమించారు. తాజాగా వెంకయ్య చౌదరి కూడా టీటీడీ జేఈవోగా పంపించారు. అలాగే కొత్త ప్రభుత్వం మారిన వెంటనే టీటీడీ పాలక మండలి రద్దయిన సంగతి తెలిసిందే. కానీ కొత్త బోర్డు ఇంకా ప్రతిపాదించలేదు. సంప్రదాయం ప్రకారం తెలంగాణకు చెందిన ముగ్గురు లేదా నలుగురిని టీటీడీ బోర్డులో నియమించే అవకాశం ఉంది. కానీ అది కూడా ఇంకా జరగలేదు.
అయితే ఇటీవల డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో కొందరు అడిగిన ప్రశ్నలకు ఈఓ శ్యామలరావు సమాధానాలు ఇచ్చారు. ఇందులో తెలంగాణకు చెందిన ఓ భక్తుడు అడిగిన ప్రశ్నకు కూడా ఈఓ సమాధానమిచ్చారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫారసు లేఖలను టీటీడీ అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించగా.. ఏపీ నుంచి వచ్చిన లేఖలను మాత్రమే పరిశీలిస్తున్నామని, వాటినే పరిగణనలోకి తీసుకుంటున్నామని ఈఓ స్పష్టం చేశారు. అలాగే ఇతర రాష్ట్రాలకు లేఖల విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇంకా రాలేదన్నారు.