Telangana Private Schools : తెలంగాణ రాష్ట్రంలోని బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లను ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రెస్మా) 25% ఉచిత సీట్లు, ప్రభుత్వ బకాయిలు, ఫీజు నియంత్రణ, మరియు స్కూళ్ల వర్గీకరణ వంటి అంశాలపై సంచలన ప్రకటన చేసింది. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయబోమన్న ట్రెస్మా ప్రకటించింది. ఇకపై 25 శాతం ఫ్రీ సీట్స్ ఇవ్వడం కుదరని తేల్చి చెప్పేసింది.ఈ ప్రకటన రాష్ట్ర విద్యావ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రైవేట్ స్కూళ్లు తమ ప్రవేశ స్థాయి (ప్రీ-ప్రైమరీ లేదా 1వ తరగతి)లో 25% సీట్లను ఆర్థికంగా వెనుకబడిన మరియు అట్టడుగు వర్గాల విద్యార్థుల కోసం ఉచితంగా రిజర్వ్ చేయాలి. అయితే ట్రెస్మా ఈ నిబంధనను అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ప్రభుత్వం నుండి బకాయి పడిన రీయింబర్స్‌మెంట్‌లను ట్రెస్మా పేర్కొంది. గత మూడు విద్యా సంవత్సరాల నుండి బకాయిలు చెల్లించకపోవడంతో స్కూళ్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ట్రెస్మా అధ్యక్షుడు శేఖర్ రావు తెలిపారు.
ట్రెస్మా ప్రతిపాదన ప్రకారం ప్రభుత్వం ఉచిత సీట్ల కోసం నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, ఆ డబ్బులతో తల్లిదండ్రులు తమకు నచ్చిన స్కూల్లో పిల్లలను చేర్పించవచ్చని సూచించింది. ఈ విధానం ద్వారా స్కూళ్లపై ఆర్థిక భారం తగ్గుతుందని, విద్యార్థులకు మెరుగైన ఎంపికలు లభిస్తాయని ట్రెస్మా వాదిస్తోంది.
ట్రెస్మా ప్రకటనలో ప్రభుత్వం నుండి బకాయి పడిన రీయింబర్స్‌మెంట్‌లు ప్రధాన సమస్యగా ఉన్నాయి. RTE కింద ప్రవేశాల కోసం ప్రైవేట్ స్కూళ్లకు చెల్లించాల్సిన ఫీజులను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని ట్రెస్మా ఆరోపించింది. ఈ ఆర్థిక ఒత్తిడి కారణంగా స్కూళ్లు ఉచిత సీట్లను అందించడం కష్టమని ట్రెస్మా తేల్చిచెప్పింది.