ఇదేనిజం,శేరిలింగంపల్లి: బీఆర్ యస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మధ్య రగులుతున్న డైలాగ్ వార్ చిచ్చు కంటిన్యూ అవుతూనే ఉన్నది. గాంధీ ఇంటిలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్ చేయడం విదితమే. అయితే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గాంధీ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ గాంధీ నివాసానికి ఒక్కసారిగా చేరుకున్నారు. దీంతో అక్కడ కొంత అలజడి వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషను కు తరలించారు.
అరికెపూడి మద్దతుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్..
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం అరికెపూడి ఇంటికి వచ్చారు. ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అరికెపూడి మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి 2018లో వచ్చాడన్నారు. తనను కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లే స్థాయి ఆయనది కాదన్నారు. పదేళ్ల నుంచి తాను పార్టీలో ఉంటున్నానన్నారు. అవసరమైతే తానే కేసీఆర్‌ను డైరెక్ట్‌గా కలుస్తానన్నారు. ప్రాంతీయ విభేదాల గురించి కౌశిక్‌రెడ్డి మాట్లాడడంపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు. వివాదం తనకు, కౌశిక్‌రెడ్డి మధ్యే కానీ పార్టీతో కాదని స్పష్టం చేశారు.