పైసలు కోసం ఏం చేయడానికైనా సిద్దపడుతున్నారు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు. చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి మృతదేహాన్ని అప్పగించేందుకు పెండింగ్ బిల్లును ఇస్తే గాని డెడ్ బాడీ ఇవ్వమని పేచిపెట్టిన సంఘటన శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రూడేన్స్ ఆసుపత్రిలో జరిగింది. వివరాల ప్రకారం.. నెల క్రితం నిజామాబాద్ జిల్లాలోని పోతంగల్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన సిద్ది నయూమ్‌ను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రూడేన్స్ హాస్పిటల్‌లో బంధువులు చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే నయూమ్ తలకు తీవ్ర గాయాలు అవ్వడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. మొన్నటి వరకు ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు అబద్దం చెప్పారని, గురువారం నుండి నయూమ్‌ను చూపించడానికి వైద్యులు నిరాకరించినట్లు మృతుడి బంధువులు తెలిపారు.
అనుమానం వచ్చిన తమకు పేషెంట్ ను చూపించాల్సిందిగా డాక్టర్లను బలవంతం పెట్టడంతో.. నయూమ్ మృతి చెందినట్లు చెప్పారన్నారు. రూ.2 లక్షల బిల్లు కట్టాలని.. లేకపోతే మృతదేహం ఇవ్వమని ఆసుపత్రి యాజమాన్యం తెలపడంతో మృతుని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో ఆస్పత్రి యాజమాన్యం వెనక్కి తగ్గి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. డబ్బుల కోసం ఎంత నీచానికైనా.. దిగజారుతారని బంధువులు అక్రోశం వెల్లగక్కారు.