టీజీఆర్టీసీని ప్రభుత్వంలో ఎప్పుడు విలీనం చేస్తారో కచ్చితమైన తేదీని చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆర్టీసీ యూనియన్లను ఎప్పుడు పునరుద్దరిస్తారు?. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఎన్ని నిధులు రిలీజ్ చేశారు?. మహాలక్ష్మి పథకం కారణంగా ఆర్టీసీ సిబ్బంది పనిఒత్తిడికి లోనై సిబ్బంది మరణిస్తున్నారు. అందుకే ఆర్టీసీలో సిబ్బందిని భర్తీ చేయాలి’’ అని అన్నారు.
శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో లిస్టింగ్‌లో లేని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఎలా మాట్లాడే అవకాశం ఇచ్చారని హరీశ్‌రావు సభాపతిని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ప్రశ్నలు ఎప్పుడైతే సభకు వస్తాయో, అవి హౌస్ ప్రాపర్టీ అవుతాయే.. తప్ప వ్యక్తిగతం కాదన్నారు. సాంబశివరావు మాట్లాడటాన్ని హరీశ్‌రావు తప్పుపట్టడం సరికాదని చెప్పారు.
గతంలో ఆర్టీసీ సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీశ్‌రావును తొలగించడానికే.. ఆర్టీసీలో యూనియన్లను ఆనాటి ప్రభుత్వం రద్దు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వం చేసిన తప్పులే మేం చేయాలని వారు భావిస్తున్నారు. పాత తప్పుల్ని కప్పిపుచ్చేందుకు.. కొత్త ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. కానీ, ఆర్టీసీని మేం బలోపేతం చేస్తాం’’ అని చెప్పారు.