Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఎన్నికల హామీలలో ఒకటైన ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా పాఠశాలలో చదువుకునే విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకంపై కీలక అప్డేట్ ఇచ్చారు. జూన్ నెలలో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ పథకం కింద 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ప్రతి సంవత్సరం రూ.15,000 జమ చేయనున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో, అంతమందికి ఈ ఆర్థిక సహాయం అందుతుంది. ఈ నిధులు జూన్ 12, నెలలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 వార్షిక బడ్జెట్‌లో ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.9,407 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరిలో సుమారు 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ అంచనా వేసింది. అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేయడం జరుగుతుంది.