– ఆరోపించిన ఇజ్రాయెల్ సైన్యం
– ట్విట్టర్లో ఓ యానిమేటెడ్ వీడియో రిలీజ్
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: హమాస్ నెట్‌వర్క్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులకు పాల్పడుతోంది. పూర్తిస్థాయి అండర్ గ్రౌండ్ దాడులకు సన్నాహకంగా కొన్ని రోజులుగా గాజాలోని టార్గెట్ ఏరియాలపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) కీలక విషయం వెల్లడించింది. గాజాలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన ‘అల్- షిఫా’.. కేవలం హాస్పిటల్ మాత్రమే కాదని, అది హమాస్ ఉగ్ర కార్యకలాపాలకు హెడ్డాఫీసుగా కూడా ఉందని ఆరోపించింది. దీనికి సంబంధించి నిఘావర్గాల ఆధారిత ఓ యానిమేటెడ్ వీడియోను ‘ట్విట్టర్’వేదికగా విడుదల చేసింది. హాస్పిటల్ భవనం కింద భూగర్భంలో ఓ నివాసం ఉన్నట్లు వీడియోలో ఐడీఎఫ్ చూపించింది.
గాజాలోని రహస్య ఉగ్రవాద స్థావరాలను బట్టబయలు చేస్తామని హెచ్చరించింది. మరోవైపు శుక్రవారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ ఉగ్రవాది అబు రకాబా హతమైనట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. హమాస్ యూఏవీలు, డ్రోన్లు, పారాగ్లైడర్లు, ఏరియల్ డిటెక్షన్, డిఫెన్స్‌కు అతడే బాధ్యత వహించినట్లు తెలిపింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిపిన దాడి ప్రణాళికలో అబు రకాబా పాలుపంచుకున్నాడని, పారాగ్లైడర్‌లతో ఇజ్రాయెల్‌లోకి చొరబడిన ఉగ్రవాదులకు సూచనలు ఇచ్చాడని పేర్కొంది. ఇజ్రాయెల్ పోస్ట్‌లపై డ్రోన్ దాడులకూ బాధ్యత వహించినట్లు ఆరోపించింది. ఇదిలా ఉండగా.. ఇంధనం, ఆహారం, విద్యుత్ కొరతతో అల్- షిఫా ఆసుపత్రిలో పరిస్థితులు దయనీయంగా మారాయి. వైమానిక దాడుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకుగానూ పౌరులు పెద్దఎత్తున తరలివస్తుండటంతో ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. ఇక్కడి ఇంక్యుబేటర్లలో ఉన్న శిశువుల విషయంలో ఎన్‌ఐసీయూ వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇంక్యుబేటర్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతే అనేకమంది శిశువులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. వెంటనే అవసరమైన వైద్య సామగ్రిని పంపించాలని, లేనిపక్షంలో భారీ విపత్తు ఎదురవుతుందని అల్-షిఫా ఆసుపత్రి వైద్యుడు నాసర్ బుల్బుల్ అన్నారు.
ఇజ్రాయెల్‌ను ఢీకొనేందుకు రెడీ: హమాస్
గాజాపై అండర్ గ్రౌండ్ దాడులకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్న ఇజ్రాయెల్.. ఆ దిశగా క్రమంగా ముందడుగేస్తోంది. కొన్ని లక్ష్యాలపై ఇప్పటికే దాడి చేసింది. అయితే, ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేందుకు తాము కూడా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని హమాస్ తాజాగా ప్రకటించింది. ‘హమాస్ మిలిటరీ విభాగంలోని అల్ కస్సామ్ బ్రిగేడ్లు, ఇతర బలగాలు.. ఇజ్రాయెల్ దూకుడును ఎదుర్కొనేందుకు, ఆ దేశ చొరబాట్లను భగ్నం చేసేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి. నెతన్యాహు, అతడి సైన్యం గాజాలో ఎటువంటి విజయాన్ని సాధించలేరు’ అని పేర్కొంది.