Homeఅంతర్జాతీయంThat's where the Hamas tunnel is అక్కడే హమాస్​ సొరంగం

That’s where the Hamas tunnel is అక్కడే హమాస్​ సొరంగం

– గాజాలోని చిన్నారుల ఆస్పత్రి కింద గుర్తించిన ఇజ్రాయెల్ సైన్యం

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: గాజాలోని సామాన్య పౌరులు, ఆస్పత్రులను హమాస్‌ తమ రక్షణ కవచాలుగా వాడుకుంటోందని ఆరోపిస్తోన్న ఇజ్రాయెల్‌ దళాలు.. తాజాగా దాన్ని బలపర్చే సాక్ష్యాలను బయటపెట్టాయి. గాజాలో భూతల పోరు సాగిస్తున్న ఐడీఎఫ్‌ సేనలు.. హమాస్‌కు చెందిన ఓ సొరంగాన్ని గుర్తించాయి. బుల్లెట్‌ ప్రూఫ్‌తో పటిష్టంగా ఉన్న ఆ టన్నెల్‌.. చిన్నారుల ఆస్పత్రికి అనుసంధానంగా ఉండటం గమనార్హం. ఆ ఆస్పత్రి కింద ఉన్న హమాస్‌ కమాండ్‌ సెంటర్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్‌ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7 నాటి దాడిలో నేవీ ఆపరేషన్లకు నాయకత్వం వహించిన హమాస్‌ కమాండర్‌ ఇంటికి సమీపంలో ఈ సొరంగాన్ని గుర్తించినట్లు ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి డేనియల్‌ హంగరీ ఆ వీడియోలో వెల్లడించారు. సోలార్‌ ప్యానెళ్లతో ఆ టన్నెల్‌కు విద్యుత్‌ సరఫరా జరుగుతున్నట్లు ఐడీఎఫ్‌ గుర్తించింది.

భూ ఉపరితలానికి 20 మీటర్ల లోపల ఉన్న ఆ సొరంగానికి బుల్లెట్‌ ప్రూఫ్‌ డోర్‌ ఉన్నట్లు డేనియల్‌ పేర్కొన్నారు. ఆ సొరంగం లోపలికి డేనియల్‌ నడుచుకుంటూ వెళ్లగా.. టన్నెల్‌కు మరో చివరన అల్‌-రాంటిస్‌ ఆస్పత్రి బేస్‌మెంట్‌ ఉన్నట్లు గుర్తించారు. యుద్ధానికి ముందు ఈ ఆస్పత్రిలో చిన్నారులు, క్యాన్సర్‌ రోగులకు చికిత్స అందించేవారని డేనియల్‌ తెలిపారు. ఆ బేస్‌మెంట్ వద్ద హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ ఉంది. అందులో రాకెట్‌ ప్రొపెల్ల్‌డ్‌ గ్రనేడ్లు, రైఫిళ్లు, ఆత్మాహుతి దాడులకు ఉపయోగించే బాడీ వెస్ట్‌లు, ఇతర పేలుడు పదార్థాలను ఆయన గుర్తించారు. ‘ఆస్పత్రులను హమాస్‌ తమ దారుణాలకు వినియోగించుకుంటోంది. ఇదీ హమాస్‌ అంటే..! ఇజ్రాయెల్‌ ఎవరితో పోరాడుతోందో ఇకనైనా ఈ ప్రపంచం అర్థం చేసుకోవాలి’అని డేనియల్‌ ఆ వీడియోలో అన్నారు. ఇక, ఇజ్రాయెల్‌ నుంచి కిడ్నాప్ చేసిన పౌరులను హమాస్‌ ఈ టన్నెల్‌లోనే బందీలుగా దాచి ఉంచినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి సొరంగంలో తాము కొన్ని ఆధారాలను గుర్తించినట్లు డేనియల్‌ వెల్లడించారు. ‘ఈ టన్నెల్‌లో ఓ బైక్‌ ఉంది.

దానికి బుల్లెట్‌ తగిలిన గుర్తులున్నాయి. బహుశా అక్టోబరు 7 నాటి దాడిలో దాన్ని ఉపయోగించి ఉండొచ్చు. ఇక, ఇక్కడ మహిళల దుస్తులు, కుర్చీలకు కట్టిన తాళ్లు కన్పించాయి. డైపర్లు, చిన్నారుల ఫీడింగ్‌ బాటిళ్లు కూడా ఉన్నాయి. వీటిని చూస్తుంటే బందీలను కొంతకాలం ఇక్కడ ఉంచినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇక్కడ ఓ క్యాలెండర్‌ ఉంది. అందులో అక్టోబరు 7 నుంచి తేదీలను మార్క్‌ చేసి ఉంచారు’అని డేనియల్‌ ఆ వీడియోలో వెల్లడించారు.ఆస్పత్రుల నుంచి హమాస్‌ తమ కమాండ్‌ సెంటర్లను నిర్వహిస్తోందని ఇజ్రాయెల్‌ పదే పదే ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్‌-షిఫాను ఐడీఎఫ్‌ దళాలు చుట్టుముట్టాయి. దీంతో ఆ ఆస్పత్రి వద్ద హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్‌, వైద్య పరికరాల సరఫరా నిలిచిపోయి రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని గాజా వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో అల్‌-షిఫా వద్ద పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్‌ తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోరింది. ఈ నేపథ్యంలోనే ఐడీఎఫ్‌ తాజాగా హమాస్‌ సొరంగం వీడియోను బయటపెట్టింది.

Recent

- Advertisment -spot_img