ఇదేనిజం, స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో భారత జట్టు అదిరే ఆరంభం దక్కించుకుంది. ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్‍లో ఐర్లాండ్‍ను చిత్తుచిత్తుగా ఓడించి టీమిండియా సత్తాచాటింది. టోర్నీని అద్భుత విజయంతో మొదలుపెట్టింది. అమెరికాలోని న్యూయార్క్ వేదికగా బుధవారం జరిగిన టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఏ పోరులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 46 బంతులు మిగిలి ఉండగానే స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి అదరగొట్టింది.
పాకిస్థాన్‍తో టీమిండియా సమరం..
టీ20 ప్రపంచకప్ 2024లో తదుపరి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‍తో భారత్ తలపడనుంది. అందరూ ఎదురుచూస్తున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జూన్ 9వ తేదీన జరగనుంది. భారత్, పాక్ మ్యాచ్ కూడా న్యూయార్క్ వేదికగానే జరగనుంది. ఈ పిచ్ బౌలింగ్‍కు చాలా అనుకూలంగా ఉండటంతో ఆ పోరు ఎలా ఉంటుందోననే ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది. టీమిండియా తొలి మ్యాచ్‍లో ఐర్లాండ్‍ను చిత్తుచిత్తుగా ఓడించడం చూసి పాకిస్థాన్ టీంలో బెదురు పుట్టింది.