నేటి సాయంత్రం 6 గంటలకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. 60 రోజుల పాటు సాగిన ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రచారం ముగియగానే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతుండటంతో ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. ప్రలోభాలు, హింసాత్మక ఘటనలపై చివరి 72 గంటలు నిఘా పెంచాలని జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసులతో పాటు పరిశీలకులు ఆకస్మిక సోదాలు చేపట్టాలని ఆదేశించారు.