తల్లిదండ్రులతో కలిసి రెండేళ్ల చిన్నారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. రెండేళ్ల చిన్నారి పోలీస్ స్టేషన్ కు ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారా.. వివరాలలోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ప్రసాద్ నగర్ లో నివాసం ఉంటున్న అక్కిరెడ్డి పురుషోత్తం రెడ్డికి రెండేళ్ల పాప ఉంది. పాప పేరు అక్కిరెడ్డి జేష్వికా శ్రీ.. పాపకు పోలీసులు అంటే అమితమైన ఇష్టం అట. పోలీసులు కనిపిస్తే బుడి బుడి అడుగులు వేస్తూ సెల్యూట్ చేయడం చేస్తూ ఉంటుందట. అయితే గురువారం పాప మూడవ పుట్టిన రోజు కావడంతో ఆ తండ్రి వినూత్నంగా ఆలోచన చేశారు. కూతురి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు అత్యంత ఇష్టమైన పోలీసుల చేత ఆశీర్వచనాలు తీసుకోవాలని నిశ్చయించుకున్నారు.
దీంతో ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ కు పోలీసు డ్రెస్ లో పాపను తీసుకువచ్చి సీఐ ముత్యాల సత్యనారాయణకు తన కూతురి కోరిక తెలిపారు ఆ తండ్రి. తమ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదులతో, సమస్యలతో వచ్చే వారిని చూస్తుంటాం కానీ ఇదేంటి ఆశీర్వాదాలు అన్నారంటూ ముందు పోలీసులు షాక్ కి గురయ్యారు. కానీ పాప కోరికను తెలుసుకొని తండ్రి కోరిన మేరకు సీఐ ముత్యాల సత్యనారాయణ, పాపను ఎత్తుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు అవ్వాలని పాప కోరుకుంటున్న నేపథ్యంలో పోలీసు కావాలని పోలీస్ అధికారులు, సిబ్బంది ఆకాంక్షించారు. అనంతరం ఎస్ఐ అనూష సైతం పాపకు దీర్ఘాయుష్షు ఆశీర్వచనాలు అందించారు.