Homeజాతీయంకరోనా వ్యాక్సిన్​ ఆకస్మిక మరణాల ముప్పును తగ్గించింది

కరోనా వ్యాక్సిన్​ ఆకస్మిక మరణాల ముప్పును తగ్గించింది

– ఐసీఎంఆర్ వెల్లడి

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ యువతలో ఆకస్మిక మరణాల ముప్పును పెంచదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనం వెల్లడించింది. ఈ మేరకు ఐసీఎంఆర్‌ అధ్యయనానికి సంబంధించిన నివేదిక ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో ప్రచురితమైంది. కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నా.. ఆకస్మిక మరణం ముప్పు తగ్గుతుందని ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది. యువతలో ఆకస్మిక మరణాలకు గల కారణాలను విశ్లేషించేందుకు అక్టోబర్‌ 1, 2021 నుంచి మార్చి 31, 2023 మధ్యకాలంలో ఐసీఎంఆర్‌ ఒక అధ్యయనాన్ని చేపట్టింది. దీని కోసం ఆకస్మికంగా మరణించిన 18-45 ఏళ్ల వయసు వ్యక్తుల కేసులను అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా 729 కేసులు, 2916 కంట్రోల్‌ కేసులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. ఈ అధ్యయనంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆకస్మిక మరణాల ముప్పు తక్కువగా ఉందని తెలిపింది. కనీసం ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నా.. ఈ ముప్పు తగ్గుతుందని నివేదికలో పేర్కొంది. ఈ ఆకస్మిక మరణాలకు ధూమపానం, తీవ్ర శ్రమ, మరణించడానికి 48 గంటల ముందు మద్యం సేవించడం, మత్తు పదార్థాల వినియోగం వంటి వాటితోపాటు, కొవిడ్‌ చికిత్స తర్వాత జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు వంటివి కూడా కారణాలు కావచ్చని తెలిపింది.

Recent

- Advertisment -spot_img