హైదరాబాద్ : మోతాదుకు మించి ఎరువుల వాడకం మంచిది కాదన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. జూబ్లీహిల్స్ సెరికల్చర్ కార్యాలయంలో వానాకాలం ఎరువుల సరఫరాపై ఎరువుల కంపెనీలతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేషం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మోతాదుకు మించి ఎరువుల వాడకం తగ్గించాలని రైతులకు సూచించారు. ప్రపంచ సగటు ఎకరానికి 78.4 కిలోలు, దేశసగటు 51.2 కిలోలు కాగా, మన రాష్ట్ర సగటు 173 కిలోలు(అనగా 86.5 పోషకాలు) అని తెలిపారు. మోతాదుకు మించిన ఎరువుల మూలంగా నేల స్వభావం దెబ్బతినడం, తెగుళ్లు, పురుగుల బెడద ఎదురవుతుందన్నారు మంత్రి. ఇటీవల వ్యవసాయ శాఖ సేకరించిన మట్టి నమూనాలను పరిశీలించిన తర్వాత, మన నేలల్లో పోటాష్ భాస్వరము అధికంగా ఉన్నట్లు, నత్రజని కొంచం తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. ఈ ఎరువులను అధిక మొత్తంలో వాడడం వలన వాతావరణ కాలుష్యమే కాక విష పూరిత మైన పంటలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు సూచించిన కొన్ని మెళకువలు పాటించినట్లైతే పైన పేర్కొన్న అనర్ధాలనూ మన స్థాయిలో నిర్ములించవచ్చని సూచించారు. గత ఏడాది ఈ రోజు వరకు 79.94 లక్షల ఎకరాలు సాగుచేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు ఒక కోటీ 17 లక్షల ఎకరాలు సాగయింది. ఈ వానకాలానికి గాను తెలంగాణకు భారత ప్రభుత్వము 22 .30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించింది. ఈ రోజు వరకు 16.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయడం జరిగింది. గత ఏడాది 19.55 లక్షల మెట్రిక్ టన్నుల కేటాయింపులకు గాను, ఈ రోజు వరకు 8.05 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయడం జరిగిందని వివరించారు మంత్రి.
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు రైతాంగం నియంత్రిత సాగుకు జై కొట్టారని మంత్రి ఉధ్ఘాటించారు. వరి, కంది, పత్తి సాగుకే రైతులు మొగ్గుచూపారని, వానాకాలానికి ముందు జిల్లాల వారీగా వేయాల్సిన పంటలను వ్యవసాయ శాఖ తగు సూచనలు ఇవ్వడం దీనికి తోడ్పడిందన్నారు. పంటల సాగు విధానాల్లో రైతులు అవలంబిస్తున్న సాగు పద్ధతులు, శాస్త్రవేత్తలు సూచించిన సాగు పద్ధతులకు మధ్య వున్న తేడాని పూరించేందుకు వ్యవసాయ శాఖను ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. మే నెల మొదటివారంలోనే రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించారని, క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని రైతులు నమ్మవద్దన్నారు మంత్రి.