– ఎన్నికల ముందు ఈసీ కీలక నిర్ణయం
– కోడ్ ఉల్లంఘించడంతోనే..
– 70 లక్షల మందికి సాయం నిలిపివేత
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. రైతు బంధు సాయం నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల ఈసీ అనుమతి ఇచ్చింది. కాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న కారణంతో తాజాగా మళ్లీ రైతు బంధుకు బ్రేకులు వేసింది. ‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదని… లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయొద్దని ముందే ఈసీ షరతు విధించింది. అయితే రైతుబంధుపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ తాజాగా ఈసీ అనుమతి నిరాకరించింది. రైతు బంధు కింద ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్‌లకు మొత్తం రూ.10 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ డబ్బు రైతుల అకౌంట్లలో పడాల్సి ఉండగా.. ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈసీ అనుమతి నిరాకరణతో రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు ‘రైతుబంధు’ సాయం నిలిచిపోనున్నది.
మేం పవర్ లోకి రాగానే 15 వేలు ఇస్తాం
‘రైతుబంధు’ పంపిణీ నిలిచిపోవడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత మాత్రమే బీఆర్ఎస్ నేతలకు ఉందని విమర్శించారు. ‘మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యల వల్ల రైతుబంధుకు ఈసీ అనుమతి రద్దు చేసింది. ఆ వ్యాఖ్యలే కారణమని ఈసీ చెప్పింది. హరీశ్‌రావు నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. నిజంగా రైతులకు మేలు చేసే ఉద్దేశం సీఎం కేసీఆర్, హరీశ్‌కు లేదు. రాష్ట్రంలో రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దు. 10 రోజుల్లో కాంగ్రెస్ రాగానే ₹15 వేలు రైతు భరోసా ఇస్తాం’ అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.