ఇదేనిజం, శేరిలింగంపల్లి: ఇటీవల నారాయణ కాలేజీ యాజమాన్యం నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలవడం విశేషం. అయితే తాజాగా హాస్టల్ వార్డెన్ కన్నుగప్పి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి కిటికీలో నుండి బయటకు గ్రిల్స్ పట్టుకొని వెళ్తుండగా జారిపడి విద్యార్థి మృతి చెందిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ సీఐ కృష్ణ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం ఏపీ లోని కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన శివ కుమార్ రెడ్డి (17) మాదాపూర్ నారాయణ రెసిడెన్షియల్ కాలేజీ వర్మ క్యాంపస్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి స్నేహితులంతా కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేశారు. అయితే ఈ క్రమంలో మెయిన్ గేట్ కు తాళాలు వేసి ఉండడంతో 5వ అంతస్తులోని కిటికీ గ్రిల్స్ పట్టుకొని కిందకు దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముందుగా కిందికి దిగుతున్న శివకుమార్ రెడ్డి జారిపడిపోయాడు. విద్యార్థులు శివకుమార్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే వార్డెన్ సేంట్ దగ్గరలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాలేజీ నుంచి పడి విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నాయకులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగాయి.