Homeహైదరాబాద్latest Newsభార్య టీ ఇవ్వలేదని భర్త ఆత్మహత్య

భార్య టీ ఇవ్వలేదని భర్త ఆత్మహత్య

ఇదే నిజం, నేషనల్​ బ్యూరో : అలసిపోయి వచ్చిన భర్త భార్యను టీ చేసి ఇవ్వమన్నాడు. కారణమేదో కానీ తన భార్య టీ ఇవ్వలేదు. అంతే క్షణికావేశంలో ఆ భర్త ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అంత చిన్న విషయానికే ఆ వ్యక్తి ఏకంగా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన బీహార్​ రాష్ట్రంలో జరిగింది. రాజ్ కుమార్ సాహ్ భార్య సుష్మా దేవితో కలిసి ఇమాద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిహ్తా గ్రామంలో ఆస్పత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అక్కడ రాజ్ తన భార్యను టీ ఇవ్వమని కోరాడు. భార్య అందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో అక్కడి నుంచి ఇంటికి వచ్చిన భర్త.. పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని ఆస్పత్రిలో ఉన్న అతని భార్య సుష్మకు స్థానికులు తెలియజేశారు. వెంటనే భార్య ఇంటికి చేరుకొని పొరుగువారి సాయంతో రాజ్​ను స్థానిక ఆస్పత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి పాట్నాకు తరలించారు. అయితే మార్గ మధ్యలోనే రాజ్ కుమార్ మృతి చెందాడు. అతని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య తనను తాను తిట్టుకుంటూ తీవ్రంగా ఏడ్చింది. టీ ఇచ్చి ఉంటే తన భర్త బతికేవాడని కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img