ఇదే నిజం : ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ పై తొమ్మిది మంది డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ తీరుని నిరసిస్తూ తొమ్మిది మంది డైరెక్టర్లు గత నెల 29వ తేదీన జిల్లా సహకార సంఘం అధికారి రామకృష్ణకు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందించారు. దీంతో 15 రోజుల వ్యవధి తర్వాత ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని సింగిల్ విండోలో డిసిఓ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. కోరం సభ్యులు ఉండడంతో చైర్మన్ పై ఓటింగ్ ను నిర్వహించగా 9 మంది సభ్యులకు గాను 8 మంది సభ్యులు హాజరై చైర్మన్ రాజేందర్ రెడ్డి కి వ్యతిరేకంగా ఓటింగ్ చేసినప్పటికీ అవిశ్వాసం నెగ్గడానికి ఒక్క ఓటు తక్కువ ఉండడంతో అట్టి అవిశ్వాసం వీగిపోయినట్లు డిసిఓ రామకృష్ణ వెల్లడించారు. యధాతరంగా ప్రస్తుత చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి సొసైటీ చైర్మన్గా కొనసాగుతున్నట్లు ప్రకటించారు. అనంతరం ఎనిమిది మంది డైరెక్టర్లు మీడియాతో మాట్లాడుతూ… చైర్మన్ ఇష్టారాజ్యంగా సొసైటీ డబ్బులు వృధా చేయడంతో పాటు తనకు నచ్చిన వ్యక్తులను సంఘంలో ఉద్యోగులుగా నియమించడాన్ని నిరసిస్తూ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినట్టు వెల్లడించారు. కొంతమంది డైరెక్టర్లను ప్రలోభాలకు గురిచేసి వారి వైపు తిప్పుకున్నారని పేర్కొన్నారు. కానీ సాంకేతికంగా ఓడిపోయినప్పటికీ నైతికంగా తామే గెలిచినట్లు వెల్లడించారు. పదవి కాలం ఉన్నంతవరకు సంఘం బలోపేతంతో పాటు సొసైటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అడుకుంటూ రైతులకు మేలు జరిగే విధంగా తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నిమ్మల రవి, డైరెక్టర్లు కొండం వేణు రెడ్డి, గాడిచెర్ల రామచంద్రం. మిడిదొడ్డి దేవయ్య, బద్దిపడిగే బాల్ రాజేందర్ రెడ్డి, ఆరుట్ల భాగ్యమ్మ, పెంజర్ల బాల్ రెడ్డి, గాడిచర్ల రామచంద్రం,యారపు భూమయ్య పాల్గొన్నారు .