ఇదేనిజం, తెలంగాణ: కేంద్రహోంమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే వీడియో రూపకల్పన మొత్తం తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కేంద్రంగానే సాగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం ఢిల్లీ పోలీసులు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా విభాగానికి నోటీసులు అందజేశారు. నేరుగా గాంధీ భవన్ కు చేరుకొని నోటీసులు ఇచ్చారు. కాగా ఈ కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు చేరుకున్న పోలీసులు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అస్లాం తస్మీన్, పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ మన్నె సతీశ్, ఆ పార్టీకి చెందిన నవీన్, శివకుమార్‌కు నోటీసులు ఇచ్చారు. మే 1న తన మొబైల్ తీసుకొని విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు రేవంత్ కు చెప్పినట్టు సమాచారం. సీఆర్పీసీ 91 ప్రకారం ఢిల్లీలో పోలీసులు ఈ నోటీసులు ఇచ్చినట్ల తెలిసింది. సెక్షన్ 153/153A/465/469/171G కింద ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వీడియోలో ఏం ఉంది?
అమిత్ షా ఈ నెల 23న సిద్దిపేట లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని.. వాటిని తిరిగి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. అయితే ఈ వీడియోను కొంతమంది మార్ఫింగ్ చేశారు. అమిత్ షా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని అన్నట్టు వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఈ అంశం సంచలనంగా మారింది. నేరుగా అమిత్ షా, బీజేపీ పెద్దలు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో కేంద్రహోంశాఖ సీరియస్ అయ్యింది. అమిత్ షా మీద క్రియేట్ చేసిన వీడియోపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నోటీసులకు భయపడను
ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై సీఎం రేవంత్ స్పందించారు. సోమవారం ఆయన కర్ణాటకలోని సేడం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తనకు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను ఉసిగొల్పి ప్రత్యర్థి పార్టీల నేతలను వేధిస్తోందని విమర్శించారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఎంతో పోరాటం చేస్తున్నారని.. ఈ పోరాటంలో కర్ణాటక నుంచి 25 ఎంపీలను గెలిపించి మోదీని గద్దె దించడానికి మీరు సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. ‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోంది. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్ ను గెలిపించండి. ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. మల్లికార్జున ఖర్గేకి మీరు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ఉంది.’ అంటూ రేవంత్ ఆరోపించారు.