సీనియర్ నటి ప్రియమణి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా చక్కటి సినిమాల్లో నటించడంతో పాటు, సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకెళుతోంది. హీరోయిన్ గా కెరీర్ ముగిసింది అనుకుంటున్న సమయంలో ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటుతోంది. వరుస హిట్లతో దుమ్మురేపుతోంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ప్రియమణి, బాలీవుడ్ లోనూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె నటించి ‘భామా కలాపం 2’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె పలువురు హిందీ హీరోయిన్లు, స్టార్స్ కిడ్స్ కు సంబంధించిన ఓ సీక్రెట్ ను బయటపెట్టింది. నిజానికి బాలీవుడ్ సెలబ్రిటీలు, వాళ్ల పిల్లలు ఎక్కడికి వెళ్లినా కెమెరాలు వెంటపడుతూనే ఉంటాయి. జిమ్ సెంటర్ల నుంచి ఎయిర్ పోర్టుల వరకు వారి ఫోటోలను క్లిక్ మనిపిస్తారు. ఇలా సినీ సెలబ్రిటీలను వెంటబడి ఫోటోలు తీసే వారిని పపరాజీ అని పిలుస్తారు. తాజాగా ప్రియమణి ఇదే విషయానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. “బాలీవుడ్ సెలబ్రిటీలు, స్టార్ కిడ్స్ బయటికి రాగానే వారిని చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తుంటారు. వారు ఎప్పుడెప్పుడు వస్తారా? ఫోటోలు తీద్దామని అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. అయితే, అదంతా జస్ట్ షో. బయటకు కనిపించేది ఒకటి. వాస్తవం మరొకటి. అలా ఫొటోలు తీసినందుకు సదరు సెలబ్రిటీలే కెమెరామెన్లకు డబ్బులు ఇస్తారు. బాలీవుడ్ లో ఈ కల్చర్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు టాలీవుడ్‌లోకి కూడా వచ్చేసింది అని ప్రియమణి చెప్పుకొచ్చింది.