మణిరత్నం తీసిన సఖి సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మాధవన్. తక్కువ టైమ్‌లో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ్‌తో పాటు పలు త్రీ ఇడియట్స్ లాంటి పలు బాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించాడు. గతేడాది రిలీజైన మాధవన్ సినిమా ‘రాకెట్రీ’జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది. సినిమాలతో పాటు ‘బ్రీత్’లాంటి వెబ్ సిరీసుల్లోనూ నటించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మాధవన్ నటించిన వెబ్ సిరీస్ ‘ది రైల్వే మెన్’నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి గొప్ప సిరీస్‌లో నటించే అవకాశం రావడం అదృష్టమన్నారు.
‘నా కెరీర్‌లో కొన్ని ప్రాజెక్ట్‌లు నాకెంతో ఆశ్చర్యాన్నిచ్చాయి. నేను ఏ సినిమాలో నటించినా నా పాత్రకు ప్రాణం పోయడానికి వందశాతం ప్రయత్నిస్తా. రెండు భాషల్లో సినిమాలు చేస్తున్నా. కాబట్టి ఏదైనా పాత్రను చూసినప్పుడు గతంలో అలాంటిదే చేసినట్లు అనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను చేసిన కొన్ని సినిమాలు చూసినప్పుడు.. వాటిల్లో నేనేమాత్రం కష్టపడినట్లుగా అనిపించదు. కానీ, విచిత్రంగా అవి విజయవంతమయ్యాయి. అప్పుడు నాకు చాలా గందరగోళంగా ఉండేది. ఏది తప్పు.. ఏది కరెక్టో అని తేల్చుకోలేకపోయేవాడిని. అలాంటి విజయానికి నేను అనర్హుడినే అని నాకు అనిపిస్తుంటుంది’ అని మాధవన్ చెప్పారు.ఇక ‘ది రైల్వే మెన్’విషయానికొస్తే.. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఆధారంగా దీన్ని రూపొందించారు. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు ఇందులో చూపించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన తొలి సిరీస్ ఇదే కావడంతో దీనిపై ఆసక్తి ఏర్పడింది.