ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో తాము 8 సీట్లు గెలుచుకున్నాము.. 40 శాతం ఓటింగ్ సాధించాము కాబట్టి తాము పాస్ అయినట్టేనని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించుకున్నారు. పైగా ఈ ఫలితాలు తమకు ఉగాది పచ్చడిలా చేదు తీపి మిగిల్చాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ భాగంగా ఉన్న పాలమూరులో కాంగ్రెస్ నెగ్గలేదు. ఆయన గత ఎన్నికల ముందు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజిగిరిలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఇక ఆయన ఇన్ చార్జ్‌గా ఉన్న చేవెళ్ల కూడా చేజారింది. రేవంత్ రెడ్డికి ఈ ఫలితాలు ఇంత చేదును మిగిలిస్తే .. ఆయన మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కు పోటీగా ఉన్న సీనియర్ లీడర్లు దుమ్ములేపారు. భారీ మెజార్టీతో తమ తమ జిల్లాల్లో అభ్యర్థులను గెలిపించుకున్నారు. రేవంత్ మాత్రం చతికిలపడ్డారు. రాష్ట్రంలో అసలు ఏ మాత్రం సంస్థాగతంగా పట్టులేని బీజేపీ అనూహ్యంగా పుంజుకొని ఆశ్చర్యకర రీతిలో కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లను సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు సాధించిన కాంగ్రెస్.. ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకుంటే.. కేవలం 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ పార్లమెంటు బరిలోనూ ఎనిమిది సీట్లు గెలచుకోవడం గమనార్హం. కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండ, భువనగిరి స్థానాలను భారీ మెజార్టీతో గెలిపించారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి ఖమ్మంలో సత్తా చాటారు.
స్థానిక సంస్థల బైపోల్లో దారుణ ఓటమి
మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల్లో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి నాగరకుంట నవీన్‌కుమార్‌రెడ్డి 109 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై గెలుపొందారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 1439 మంది స్థానిక సంస్థల ప్రతినిధులకు ఓటుహక్కు కల్పించగా.. మార్చి 28న పోలింగ్ నిర్వహించారు. మొత్తం ఓట్లలో 1437 ఓట్లు పోలయ్యాయి. పాలమూరు ముఖ్యమంత్రికి సొంత జిల్లా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపించుకోవడం ఆయనకు అనివార్యం.. ఓటర్లు మొత్తం స్థానిక సంస్థల ప్రతినిధులే.. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ.. వారికి ఏ అవసరం వచ్చిన కాంగ్రెస్‌పార్టీనే ఆశ్రయించాల్సి వస్తుంది. అయినప్పటికీ వారు హస్తం పార్టీకి ఓటు వేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి సైతం పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. 1439 ఓట్లున్న ఒక స్థానంలో 109 ఓట్ల అధిక్యంతో బీఆర్ఎస్ గెలుపొందడం అంటే కచ్చితంగా రేవంత్ రెడ్డికి పరాభవమే. కానీ ఆయన మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ఓట్లు కమలం పార్టీకి బదిలీ అయ్యాయని కొత్త రాగం అందుకున్నారు. తాను సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజిగిరిలో, సొంతజిల్లా పాలమూరులో, తాను ఇన్ చార్జ్ గా ఉన్న చేవెళ్లలో పార్టీ ఓడిపోవడంపై మాత్రం మౌనం దాల్చారు.
మల్కాజిగిరిలో ఘోర పరాజయం
తన సిట్టింగ్ సీటు మల్కాజిగిరిని కాపాడుకొనేందుకు రేవంత్ విశ్వప్రయత్నం చేశారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున మల్లారెడ్డి కుమారుడు పోటీ చేయకుండా కట్టడి చేయగలిగారు. పరోక్షంగా కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేసేలా ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అస్త్ర శస్త్రాలు ఉపయోగించారు. నేతలను దారికి తెచ్చుకున్నారు. ఇంత చేసినా ఇక్కడ బీజేపీ అభ్యర్థి 3 లక్షల పై చిలుకు మెజార్టీతో గెలుపొందారు. కనీసం ఈ స్థానంలో కాంగ్రెస్ గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. అధిష్ఠానం తెలంగాణ మీద గట్టి ఆశలే పెట్టుకున్నది. తెలంగాణలో 14 స్థానాలు గెలుస్తామని లోకల్ నాయకత్వం ప్రకటించుకున్నది. కానీ ఇక్కడ వచ్చింది కేవలం ఎనిమిది సీట్లే. అయితే మల్కాజిగిరి, పాలమూరు, చేవెళ్ల లాంటి చోట్ల కాంగ్రెస్ ఓడిపోవడంతో హైకమాండ్ రేవంత్ రెడ్డికి క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై దీపాదాస్ మున్షీ చాలా ఆగ్రహంగా ఉన్నారట. మరి రేవంత్ రెడ్డిని మందలించబోతున్నారా? అన్నది వేచి చూడాలి.
చేవెళ్ల ఎందుకలా..
చేవెళ్ల పార్లమెంటు స్థానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరి కోరి జీ రంజిత్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఈ సెగ్మెంట్ కు రేవంత్ ఇన్ చార్జ్ గా కూడా ఉన్నారు. కానీ ఈ సీటులో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంతో సునాయాసంగా ఇక్కడ గెలుపొందారు. కంటోన్మెంట్ గెలిపించుకున్నాం.. మాకు గతంకంటే ఓట్ల శాతం పెరిగింది. అని రేవంత్ సర్ది చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆయన ఫెయిల్యూర్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.