ఇదే నిజం, కామారెడ్డి: కట్టుకున్న భార్యను 20 రోజుల పాటు ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టిన భర్త.. చివరకు తన స్నేహితుడితో కలిసి ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన గంగాధర్ గౌడ్ తో తొమ్మిదేళ్ల క్రితం రంగారాణి(30)కి పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా గంగాధర్ గౌడ్ విశాఖపట్టణానికి చెందిన బాలాజీతో స్నేహం చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న గంగాధర్ గౌడ్.. ఆమెను 20రోజులపాటు ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టాడు. చివరకు పురుగుల మందు తాగించడంతో ఆమె తప్పించుకొనితల్లిదండ్రుల వద్దకు చేరుకోవడంతో, వారు నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూసింది. రంగారాణి తండ్రి రాజేశ్వర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురిని అల్లుడు చిత్రహింసలు పెట్టి పురుగుల మందు తాగించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, గంగాధర్ గౌడ్ రంగారాణిపై దాడి చేసింది వాస్తవమేనని, ఆమె ఆత్మహత్యాయత్నం చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలుస్తాయని పేర్కొన్నారు.