HomeతెలంగాణTheft : భలే దొంగలు.. సెల్ టవర్ నే ఎత్తుకెళ్లారు

Theft : భలే దొంగలు.. సెల్ టవర్ నే ఎత్తుకెళ్లారు

Theft:

బీహార్‌ రాజధాని పాట్నాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మొబైల్ కంపెనీ అధికారులుగా నటిస్తూ.. ఏకంగా సెల్ టవర్‌నే ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు. రూ. 19 లక్షల విలువ చేసే ఈ టవర్‌ను చూస్తుండగానే మాయం చేశారు మాయగాళ్లు. పాట్నాలోని గార్దానీబాగ్ ప్రాంతంలోని యార్‌పూర్‌ రాజ్‌పుతానా కాలనీలో ఉన్న లాలన్ సింగ్ అనే వ్యక్తి ఇంటి టెర్రస్‌పై గుజరాత్ టెలి లింక్ ప్రైవేట్ లిమిటెడ్(GTPL) కంపెనీ టవర్‌ను ఏర్పాటు చేశారు. అయితే, కొందరు వ్యక్తులు లాలన్ సింగ్ వద్దకు వచ్చి.. కంపెనీకి భారీ నష్టాలు వస్తున్నాయని, అందుకే తాము మొబైల్ టవర్‌ను తొలగించాలని ప్లాన్ చేశామని చెప్పారు. చూడటానికి అధికారుల మాదిరిగానే ఉండటంతో నమ్మిన లాలన్ సింగ్.. అందుకు అంగీకరించాడు. వారి ఐడీ కార్డులను కూడా చూడకుండానే టవర్‌ను తొలగించేందుకు ఒప్పుకున్నాడు. దాంతో అదే ఛాన్స్‌గా భావించిన కేటుగాళ్లు.. తమ ప్లాన్‌ను అమల్లో పెట్టారు.

మరుసటి రోజు 25 మంది బృందం వచ్చి.. మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడి గ్యాస్ కట్టర్ మిషన్‌తో మొబైల్ టవర్‌ను ముక్కలు చేశారు. ఆ ముక్కను ఓ ట్రక్కులో ఎక్కించుకుని ఎంచక్కా వెళ్లిపోయారు. అయితే, ఈ విషయం చివరకు అసలైన అధికారులకు చేరింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. టవర్ నిర్మించిన స్థల యజమానిని విచారించారు. అసలు విషయం చెప్పడంతో వారు కంగుతిన్నారు. చోరీకి గురైన మొబైల్ టవర్ విలువ రూ. 19 లక్షలు ఉంటుందని, 15 ఏళ్ల క్రితం లాలన్ సింగ్‌ ఇంటిపై అమర్చామని జీటీపీఎల్ అధికారులు తెలిపారు. సెల్ టవర్ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కంపెనీ అధికారులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. గతంలోనూ బీహార్‌లో ఇలా వింత చోరీ జరిగింది. ససారం జిల్లాలో 500 టన్నుల బరువున్న 60 అడుగుల పొడవైన ఇనుప వంతెనను జలవనరుల శాఖ అధికారుల పేరి చెప్పి ఎత్తుకెళ్లారు. మొన్నటి మొన్న ఏకంగా రైలింజన్‌నే ఎత్తుకెళ్లారు దుండగులు.

Recent

- Advertisment -spot_img