తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయ వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న విగ్రహం రూపాన్ని మార్చి కొత్త విగ్రహాన్ని ఈ నెల 9న ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటో మరోసారి తెలంగాణ తల్లి వివాదానికి ఆజ్యం పోసింది. ఈ విగ్రహ నమూనాపై బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పాత తెలంగాణ తల్లి పాత విగ్రహం- కొత్త తల్లి కొత్త విగ్రహం మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. పాత తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి జరీ అంచు పట్టు చీర ధరించి ఉంది. అయితే కొత్త విగ్రహంలో పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించి కనబడుతోంది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా.. కొత్త విగ్రహంలో ఆ రెండూ లేవు. గతంలో ఉన్న విగ్రహంలో తెలంగాణ తల్లి చేతికి బంగారు గాజులు ఉండగా, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మట్టి గాజులు ధరించి ఉంది. గత విగ్రహం రాజమాతలా ఉందనే విమర్శలు రాగా.. కొత్త విగ్రహం సాధారణ మహిళ రూపాన్ని తలపిస్తోంది. పాత విగ్రహానికి వెండి మెట్లు మరియు రత్న కిరీటం ఉండగా, కొత్త విగ్రహం మెడలో కంటి ఆభరణం మాత్రమే ఉంది. పాత విగ్రహం కుడిచేతిలో మక్క కంకులు ఉండగా, కొత్త విగ్రహం కుడిచేతిలో అభయహస్తం కనిపిస్తుంది. పాత విగ్రహంలో ఎడమచేతిలో బతుకమ్మ ఉండగా.. కొత్త విగ్రహంలో ఎడమచేతిలో వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. రెండు విగ్రహాల రూపాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది.