ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లో చేరే ఎమ్మెల్యేలతో ఇబ్బంది లేదని ఆ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. దొంగల్లో కలిసేవాళ్లతో ఇబ్బంది లేదని చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామన్నారు. సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్కనే కాదన్నారు. పార్టీ నుంచి పోయి దొంగలల్ల కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకరు పోతే పది మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని పునరుద్ఘాటించారు. ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పార్టీ కార్యకర్తల సమావేశం శుక్రవారం కూడా కొనసాగింది.
కోరుట్ల జగిత్యాల నియోజక వర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలి వున్నయని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కలలను నెరవేర్చగలిగే అవగాహన మనకు మాత్రమే ఉన్నదని అన్నారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ కు మాత్రమే ఉన్నదని కేసీఆర్ వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘మనం రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజలకోసం పనిచేయాల్సి ఉందన్నారు. ప్రజలు అవకాశమిస్తే..గత పదేండ్లు చిత్తశుద్ధితో రాజీపడకుండా ఉద్యమ ఆకాంక్షల సాధనదిశగా లక్ష్యం ప్రకారం పనిచేసి ప్రగతిని సాధించి ప్రజల మన్ననలను పొందినం.కుల మతాలకతీతంగా పని చేస్తూ వ్యవసాయం,సాగునీరు,విద్యుత్తు వంటి అనేక మౌలిక వ్యవస్థలను మెరుగుపరుస్తూ అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం చూపించామన్నారు.