టీజీఎస్ ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచిందన్న ప్రచారంలో వాస్తవం లేదని, ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఎండీ సజ్జనార్ అన్నారు. సాధారణ సేవలకు సాధారణ ఛార్జీలే వర్తిస్తాయని తెలిపారు. దీపావళి రౌండ్ ట్రిప్ రద్దీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో మాత్రమే ప్రభుత్వ జీవో ప్రకారం ఛార్జీలను సవరించినట్లు సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ లేకపోవడంతో ఆ ప్రత్యేక బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల ప్రకారం టికెట్ ధరను సవరించాలని 2003లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.16 జారీ చేసింది. 21 ఏళ్లుగా సాధారణ ప్రక్రియగా సాగుతున్న పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే ప్రత్యేక బస్సుల్లో మాత్రమే రూ.1.50 వరకు టిక్కెట్ ధరలను సవరించే వెసులుబాటును సంస్థకు కల్పించినట్లు పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ రీజియన్ నుంచి 127, రంగారెడ్డి నుంచి 105, వరంగల్ నుంచి 66, ఆదిలాబాద్ నుంచి 16 ప్రత్యేక బస్సులను హైదరాబాద్ కు సంస్థ నడిపింది. సోమవారం సాయంత్రం వరకు ఆయా ప్రాంతాల నుంచి మరో 147 సర్వీసులు ఏర్పాటు చేశామని, ఈ ప్రత్యేక బస్సుల్లో మాత్రమే జీవో ప్రకారం ఛార్జీలను సవరించామని తెలిపారు.