Homeహైదరాబాద్latest Newsగృహజ్యోతి ఉచిత విద్యుత్​ పొందాలంటే కండిషన్స్​ ఇవే

గృహజ్యోతి ఉచిత విద్యుత్​ పొందాలంటే కండిషన్స్​ ఇవే

ఎన్నికల హామీలో భాగంగా ఒక్కో గ్యారంటీని పట్టాలెక్కిస్తోంది రేవంత్ సర్కారు. మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు రెడీ అయ్యాయి. వాటి ప్రకారం 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సరఫరాకు షరతులు వర్తించనున్నాయి. 200 యూనిట్ల వరకు ప్రభుత్వమే ఉచిత కరెంట్‌ ఇస్తుందని ఇష్టారాజ్యంగా వాడకం పెంచేస్తే, అదనపు వాడకానికి బిల్లులు చెల్లించక తప్పదు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2022–23లో నెలకు సగటున వాడిన విద్యుత్‌కు అదనంగా 10 శాతం విద్యుత్‌ను మాత్రమే గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయనుంది. నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితికి లోబడి ఈ పథకం అమలు కానుంది. ఉదాహరణకు 2022–23లో ఒక కుటుంబ వార్షిక విద్యుత్‌ వినియోగం 840 యూనిట్లు అయితే, సగటున నెలకు 70 యూనిట్లు వాడినట్టు నిర్ధారిస్తారు. అదనంగా మరో 10 శాతం అంటే 8 యూనిట్లను కలిపి నెలకు గరిష్టంగా 78 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే ఆ కుటుంబానికి ఉచితంగా సరఫరా చేస్తారు. 78 యూనిట్లకు మించి వాడిన విద్యుత్‌కు సంబంధిత టారిఫ్‌ శ్లాబులోని రేట్ల ప్రకారం బిల్లులు జారీ చేస్తారు.

ఒక వేళ 2022–23లో సగటున నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్‌ వాడినట్టైతే ఈ పథకం వర్తించదు. వార్షిక విద్యుత్‌ వినియోగం 2,400 యూనిట్లు మించిన వినియోగదారులు ఈ పథకానికి అనర్హులు. నెలకు అనుమతించిన పరిమితి మేరకు ఉచిత విద్యుత్‌ను వాడిన వినియోగదారులకు ‘జీరో’ బిల్లును జారీ చేస్తారు. అంటే వీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ కరెంట్ వినియోగం అనుమతించిన పరిమితికి మించినా, గరిష్ట పరిమితి 200 యూనిట్లలోపే వాడకం ఉండాలి. ఒకవేళ నెల వినియోగం 200 యూనిట్లకు మించితే వాడిన మొత్తం కరెంట్‌కు బిల్లును యథాతథంగా జారీ చేస్తారు. అప్పుడు ఎలాంటి ఉచితం వర్తించదు. విద్యుత్‌ బిల్లుల బకాయిలు చెల్లించాల్సిన వినియోగదారులకు గృహజ్యోతి పథకం వర్తించదు. బకాయిలన్నీ చెల్లించిన తర్వాతే పథకాన్ని వర్తింపజేస్తారు. గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బిల్లులను చెల్లించకుండా బకాయి పడిన వారికి సైతం పథకాన్ని నిలిపేస్తారు. బిల్లులు చెల్లించాకే మళ్లీ పథకాన్ని పునరుద్ధరిస్తారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న కుటుంబానికి మాత్రమే పథకం వర్తిస్తుంది. రేషన్‌కార్డు ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. లబ్ధిదారులు దరఖాస్తులో పొందుపరిచిన గృహ విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్‌ నంబర్‌ను రేషన్‌కార్డుతో అనుసంధానం చేస్తారు. రేషన్‌కార్డుతో విద్యుత్‌ కనెక్షన్‌ను అనుసంధానం చేసినా, విద్యుత్‌ కనెక్షన్‌ ఎవరి పేరు మీద ఉందో వారి పేరు మీదే బిల్ జనరేట్ అవుతుంది.

Recent

- Advertisment -spot_img